Kapil Sharma: నాకంటూ ఎవరూ లేరు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.

12 Mar, 2023 13:22 IST|Sakshi

నటించడం సులువేమో కానీ నవ్వించడం మాత్రం చాలా కష్టం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో నటులే ఒప్పుకున్నారు. అయితే పైకి నవ్వుతూ కనిపించినంతమాత్రాన వారి జీవితాల్లో ఏ కష్టాలూ లేవనుకుంటే పొరపాటే! లోపల ఎన్ని బాధలున్నా బయటకు మాత్రం చిరునవ్వుతోనే దర్శనమిస్తారు. తాజాగా ప్రముఖ కమెడియన్‌, నటుడు కపిల్‌ శర్మ ఒకానొక దశలో మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే..

నందితా దాస్‌ 'జ్విగాటో' సినిమాలో కపిల్‌ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ సినిమా మార్చి 17న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్లలో తాను డిప్రెషన్‌లోకి వెళ్లిన విషయాన్ని వెల్లడించాడు. 'ఒక సెలబ్రిటీగా కోట్లాది మందికి నేను తెలుసు.. ఎందుకంటే నేను వారికి వినోదాన్ని పంచుతాను. కానీ ఇంటి లోపల అడుగుపెట్టాక ఒంటరివాడిని అనిపించేది. సముద్రం ఒడ్డుకు వెళ్లి అలల అందాన్ని చూడాలనుకున్నా అది నాకు సాధ్యపడదు. రెండు గదుల రూములో ఒక్కడినే ఉండేవాడిని. సాయంత్రానికే అంతా చీకటయ్యేది. అప్పుడు నేనెంత విచారంగా ఫీలయ్యానో మాటల్లో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లైతే ఆత్మహత్య చేసుకోవాలనిపించేది.

నా గుండెలోని బాధను చెప్పుకుని మనసు తేలిక చేసుకోవడానికి నాకంటూ ఎవరూ లేరని భావించాను. మానసికంగా కుంగిపోయాను. అలా జరగడం అదే మొదటిసారని నేను చెప్పను. నా బాల్యంలోనూ నేను ఒంటరితనాన్ని ఫీలయ్యాను. కానీ ఎవరూ దాన్ని గుర్తించలేదు. తర్వాత బాగానే పేరు తెచ్చుకున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను. కానీ నాకంటూ ఎవరూ లేరు అన్న బాధ నన్ను వెంటాడేది. ఒక ఆర్టిస్టు అమాయకుడిగా ఉన్నాడంటే అతడు పిచ్చోడేం కాదు. కానీ నా చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించేకొద్దీ నా కళ్లు తెరుచుకున్నాయి. జీవితంలో సుఖదుఃఖాలు ఏవీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను' అని చెప్పుకొచ్చాడు కపిల్‌ శర్మ.

మరిన్ని వార్తలు