Comedian Lakshmipathi: కమెడియన్‌ లక్ష్మీపతి కుటుంబంలో ఎన్ని కష్టాలో..

26 Dec, 2022 12:25 IST|Sakshi

ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కమెడియన్లలో లక్ష్మీపతి ఒకరు. బాబీ, అల్లరి, మురారి, నీ స్నేహం, తొట్టిగ్యాంగ్‌, పెదబాబు, కితకితలు.. ఇలా దాదాపు 40 సినిమాల్లో నటించారాయన. మరీ ముఖ్యంగా ఆయన సునీల్‌తో కలిసి చేసిన కామెడీ సీన్స్‌ చూస్తే ఇప్పటికీ కడుపుబ్బా నవ్వుకుంటారు. లక్ష్మీపతి అన్న శోభన్‌ కూడా ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా రాణించారు. మహేశ్‌బాబు 'బాబీ', ప్రభాస్‌ 'వర్షం' సినిమాలకు ఈయనే దర్శకత్వం వహించారు. ఈ అన్నదమ్ములిద్దరూ కేవలం నెల రోజుల వ్యవధిలోనే కన్నుమూయడం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ఈ అన్నదమ్ముల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది లక్ష్మీపతి కూతురు, ఆర్జే శ్వేతా లక్ష్మీపతి.

'సినిమాలను తీసే క్రమంలో ఆస్తులు పోయాయి. రెండు థియేటర్లు అమ్మేశారు. కొన్నాళ్లు బాబాయి కనిపించలేదు. ఆ తర్వాత ఒక లెటర్‌ వచ్చింది. అందులో బాబాయి ఒక చోట క్షేమంగా ఉన్నానని రాసి డబ్బులు కూడా పంపించాడు. నా పుట్టినరోజుకు ముందు గిఫ్ట్‌ పంపించాడు. ఆయన డైరెక్టర్‌గా పనిచేసిన తొలి చిత్రం బాబీ ఫ్లాప్‌ కావడంతో ఫ్యామిలీపై దెబ్బపడింది. ఆర్థికంగా కుటుంబం అంతా కష్టాలు పడింది. అందుకని నెక్స్ట్‌ మూవీ వర్షం ఎంతో కసితో తీశాడు. అది సక్సెస్‌ అయింది కానీ తర్వాత తీసిన చంటి ఫెయిల్యూర్‌గా నిలవడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.

బాబాయి చనిపోయినప్పుడు నేను వైజాగ్‌లో ఉన్నాను. అప్పుడు నా ఫోన్‌ పని చేయలేదు. రాత్రి 9 గంటలకు ఆఫీస్‌ ఫ్రెండ్స్‌ నా ఫ్లాట్‌కొచ్చి డోర్‌ కొట్టారు. అప్పుడే ఏదో నా మనసు కీడు శంకించింది, బాబాయ్‌కు బాలేదని చెప్పారు. నేను బస్సెక్కి ఇంటికి వెళ్తుంటే ఓ వార్తాపత్రికలో జనవరి 5న ఆయన చనిపోయారని చదివాను. ఆయనకు పొగ తాగడం తప్ప ఎటువంటి చెడ్డ అలవాటు లేదు. ఇంటికెళ్లేసరికి అందరూ ఏడుస్తున్నారు, కానీ నేను ఏడవలేదు. అందరూ నిద్రపోయాక ఏడ్చాను.

బాబాయి లేరన్న బాధ తట్టుకోలేక నాన్న తాగి వచ్చాడు. ఆ కోపంతో నాన్నతో మాట్లాడలేదు. బాబాయి అంత్యక్రియలైపోయాక నేను వైజాగ్‌ వెళ్తుంటే నాన్న నన్ను పట్టుకుని ఏడ్చాడు. అయినా మాట్లాడకుండా వెళ్లిపోయాను. బాబాయి చనిపోయిన నెల రోజులకే ఫిబ్రవరి 5న నాన్న చనిపోయాడు. అప్పుడు కూడా నేను వైజాగ్‌లో ఉన్నాను. ఆరోజు పొద్దున నాన్న ఫోన్‌ చేసి అమ్మవాళ్లు ఇంకా ఇంటికి రాలేదేంటని అడిగారు. గంటలోపు వచ్చేస్తారులే అని చెప్పాను. తీరా మధ్యాహ్నం అయ్యేసరికి అమ్మ ఫోన్‌ చేసి నాన్నకు బాలేదని రమ్మన్నారు. వరుసగా ఫోన్లు రావడం మొదలైంది. విషయం సీరియస్‌ అని అర్థమైంది. వెంటనే హైదరాబాద్‌ వచ్చి నాన్నను కడసారి చూశాను. బాబాయి మరణంతో ఆయన బాగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అదే ఆయన్ను కుంగదీసింది' అని చెప్పింది శ్వేత.

చదవండి: బుల్లితెర నటి సూసైడ్‌, పోస్ట్‌మార్టమ్‌లో ఏముందంటే?
అజిత్‌ -త్రిష కాంబినేషన్‌లో మూవీ

మరిన్ని వార్తలు