Sunil Pal: పోర్నోగ్రఫీ వివాదంలోకి ఫ్యామిలీ మ్యాన్‌ నటుడు

27 Jul, 2021 15:15 IST|Sakshi

Sunil Pal: నీలి చిత్రాల కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను అరెస్ట్‌ చేయడంపై కమెడియన్‌ సునీల్‌ పాల్‌ స్పందించాడు. పోర్నోగ్రఫీ రాకెట్‌ గుట్టు రట్టు చేయడమే కాక అతడిని అరెస్ట్‌ చేసినందుకు పోలీసులను అభినందించాడు. అయితే ఈ పోర్న్‌ అనేది రకరకాల రూపాల్లో విస్తరిస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడాడు. 'రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేయడం సబబైనదే. ఇదిప్పుడు అవసరం కూడా! ఎందుకంటే పలుచోట్ల సెన్సార్‌ లేకపోవడంతో కొందరు పెద్ద తలకాయలు అడ్డగోలు వెబ్‌సిరీస్‌లు తీస్తున్నారు. అవి ఇంట్లోవాళ్లతో కలిసి చూడలేనంత ఘోరంగా ఉంటున్నాయి. 

ఉదాహరణకు మనోజ్‌ బాజ్‌పాయ్‌ను తీసుకుందాం. అతడు పెద్ద నటుడే కావచ్చు. కానీ అతడిలాంటి సభ్యత లేని వ్యక్తిని, నీచుడిని నేనింతవరకు చూడలేదు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న అతడు ఫ్యామిలీ ఆడియన్స్‌ కోసం ఏం చేస్తున్నాడు? అతడు నటించిన ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌లో.. భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో ఎఫైర్‌, మైనర్‌ బాలికకు బాయ్‌ఫ్రెండ్‌, చిన్న పిల్లాడు తన వయసుకు మించి ప్రవర్తించడం.. ఓ కుటుంబం అంటే ఇలాగే ఉంటుందా? ఇవా మీరు చూపించేది?

ఇక పంకజ్‌ త్రిపాఠి నటించిన మీర్జాపూర్‌ పనికిరాని వెబ్‌సిరీస్‌. అందులో చేసినవాళ్లంటేనే నాకు అసహ్యం. పోర్న్‌పై నిషేధం విధించినట్లుగానే ఈ పనికిరాని వెబ్‌సిరీస్‌లను కూడా బ్యాన్‌ చేయాలి. కేవలం కళ్లకు కనిపించేదే కాదు, ఆలోచనల్ని చెడగొట్టేది కూడా పోర్న్‌ కిందకే వస్తుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా సునీల్‌ పాల్‌ 2005లో ఇండియన్‌ లాఫ్టర్‌ చాలెంజ్‌లో విజేతగా నిలిచాడు. 2010లో 'భవ్నావో కో సమజో' అనే కామెడీ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరిన్ని వార్తలు