ప్రతి అమ్మాయి జీవితకథ

19 Nov, 2020 00:40 IST|Sakshi
రమ్య పసుపులేటి, అన్వేషి జైన్, తేజస్వి మడివాడ

నలుగురు ఆడవాళ్ల జీవితంలోకి మగవాళ్లు ఎంటర్‌ అయిన తర్వాత వాళ్ల జీవితం ఏ విధంగా మారిపోయింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కమిట్‌మెంట్‌’. తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, సూర్య శ్రీనివాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘హైదరాబాద్‌ నవాబ్స్‌’ ఫేమ్‌ లక్ష్మీకాంత్‌ చెన్నా దర్శకత్వం వహించారు. రచన మీడియా వర్క్స్‌ సమర్పణలో బల్‌దేవ్‌ సింగ్, నీలిమా .టి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ఆడపిల్లలు కనపడితే కమిట్‌మెంటులు, కాంప్రమైజ్‌లు తప్ప ఇంకేమీ ఆలోచించరా’’ అంటూ తేజస్వి చెప్పే డైలాగ్‌తో టీజర్‌ సాగుతుంది.

ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ– ‘‘ప్రతి యాక్టర్‌ కెరీర్‌లో ఓ క్లిష్ట దశ ఉంటుంది. నేను కూడా అలాంటి స్టేజ్‌లో ఉన్నప్పుడు ఈ అవకాశం నా దగ్గరకు వచ్చింది. మళ్లీ నాకు సినిమాలపై ఇంట్రస్ట్‌ రావటానికి కారణం డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌గారే. ఇది కేవలం స్క్రిప్ట్‌ మాత్రమే కాదు, ప్రతి అమ్మాయి జీవితకథ’’ అన్నారు. అన్వేషి జైన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో తెలుగు నటీనటులతో కలిసి పనిచేయటం మంచి ఎక్స్‌పీరియన్స్‌.

అన్ని అంశాలు కలగలిపి ఈ సినిమా ఒక రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా ఉంటుంది’’ అన్నారు. లక్ష్మీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘అన్ని ఇండస్ట్రీల్లో అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కిన్‌ షో చేసి అమ్ముకోవాలని ఈ సినిమా చేయలేదు. కథను బలంగా నమ్మి తీసిన చిత్రమిది’’ అన్నారు. ‘‘అనిల్‌గారితో కలిసి ఈ సినిమా నిర్మించాను. దర్శకుడు చక్కగా తెరకెక్కించటంతో పాటు ప్రతి ఒక్కరూ బాగా నటించారు’’ అన్నారు నిర్మాత బల్‌దేవ్‌ సింగ్‌. ఈ చిత్రానికి సంగీతం: నరేష్‌ కుమరన్‌.
 

మరిన్ని వార్తలు