Kangana Ranaut: నాటి స్వాతంత్య్రం భిక్ష

12 Nov, 2021 06:01 IST|Sakshi

2014లోనే దేశానికి అసలైన స్వేచ్ఛ

నటి కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

కంగ‌నా ర‌నౌత్‌పై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామాగా నిలిచిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలమైన 1947 నాటి దేశ స్వాతంత్య్రాన్ని ఆమె ‘భిక్ష’గా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో సర్కార్‌ కొలువుతీరిన 2014 ఏడాదిలోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్లు భావించాలని ఆమె వ్యాఖ్యానించారు. ఒక ఛానెల్‌ నిర్వహించిన కార్యక్రమంలో కంగన మాట్లాడిన వీడియోను పిలిభిత్‌ ఎంపీ, బీజేపీ నేత వరుణ్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.‘ 1947లో దేశం స్వాతంత్య్రం పొందలేదు.

అది కేవలం ఒక భిక్ష. మనందరికి 2014లోనే అసలైన స్వాతంత్య్రం వచ్చింది. ఆనాడు భిక్షగా పొందిన దానిని మనం స్వాతంత్య్రంగా ఎలా భావిస్తాం?. దేశాన్ని కాంగ్రెస్‌కు వదిలేసి బ్రిటిషర్లు వెళ్లిపోయారు. బ్రిటిషర్ల పాలనకు మరో కొనసాగింపు రూపమే కాంగ్రెస్‌’ అని ఆ వీడియోలో ఉంది. ‘1857లోనే మనం తొలిసారిగా స్వాతంత్య్రం కోసం ఐక్యంగా పోరాడాం. కానీ ఆ ఉద్యమాన్ని బ్రిటిషర్లు అణిచివేశారు. దాదాపు శతాబ్దం తర్వాత బ్రిటిషర్లు ‘స్వాతంత్య్రం’ అనే దానిని గాంధీజీ భిక్ష పాత్రలో వేశారు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేశారు.

వెల్లువలా విమర్శలు
కంగన వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్, ఆప్, శివసేన ఇలా పార్టీలకతీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. దేశద్రోహం సెక్షన్ల కింద కంగనపై కేసు నమోదుచేయాలని ఆప్‌ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ప్రీతి శర్మ మీనన్‌ ముంబై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దేశప్రజలందరికీ కంగన బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ అన్నారు. ‘ గాంధీజీ, భగత్‌సింగ్, నేతాజీ లాంటి త్యాగధనులను అవమానించిన కంగన నుంచి పద్మశ్రీని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే కేంద్రం ఇలాంటి మరెంతో మందిని ప్రోత్సహిస్తోందని భావించాల్సిందే’ అని ఆయన అన్నారు. ‘కంగన మాటలను దేశద్రోహంగా భావించాలా? లేక పిచ్చిపట్టి మాట్లాడుతోంది అనుకోవాలా?. ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలను మనం కేవలం ఖండించి వదిలేస్తే సరిపోదు’ అని బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ ఆగ్రహంగా మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు