గేలి చేయడం హింసే: దర్శకుడు

21 Jul, 2022 15:11 IST|Sakshi
‘కాంప్లెక్స్‌’ మూవీలోని ఓ సన్నివేశం

గేలి చేయడం కూడా హింసే అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని రూపొందిస్తున్న చిత్రం ‘కాంప్లక్స్‌’ అని ఆ చిత్ర దర్శకుడు మంత్ర వీరపాండియన్‌ తెలిపారు. దీని గురించి ఆయన తెలుపుతూ ఇంజినీరింగ్‌ చదివిన తాను విదేశాలలో మంచి ఉద్యోగం చేసుకుంటూ సినిమాపై ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చానన్నారు. పలు షార్ట్‌ ఫిల్మ్‌ చేసిన తాను, దర్శకుడు బాలా వద్ద నాచియార్, వర్మ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశానన్నారు. ఆ తరువాత ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో ప్రముఖ నటీనటులతో చిత్రం చేసే అవకాశం వచ్చిందన్నారు. అయితే అంతకు ముందు కాంప్లక్స్‌ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించానన్నారు. మనిషి రూపాన్ని చూసి అతని ప్రతిభను అంచనా వేయరాదని చెప్పే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు.

అలాగే ఇతరుల రూపాన్ని పరిహాసం చేయడం కూడా హింసే అవుతుందని ఈ చిత్రం ద్వారా చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో పాత్రలకు తగిన ఆర్టిస్టులను ఎంపిక చేసి నటింప చేసినట్లు చెప్పారు. ఆ విధంగా నటుడు వెంకట్‌ సెంగుట్టవన్, నటి ఇవన ఇందులో హీరో హీరోయిన్లుగా నటించినట్లు చెప్పారు. దీనికి కార్తీక్‌ రాజా సంగీతాన్ని అందించారని, షూటింగ్‌లు పూర్తి చేసి ఆయనకు చూపించగా చాలా బాగుందని అభినందించడంతో పాటు నాలుగు చక్కని పాటలను ఇచ్చారని తెలిపారు. చిత్ర షూటింగ్‌ పూర్తి అయినట్లు చెప్పారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.  

మరిన్ని వార్తలు