కృష్ణ విషయంలో వైద్యనీతి పాటించాం.. ఫ్యామిలీతో చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నాం: వైద్యులు

15 Nov, 2022 09:37 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణంపై కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ కారణంగానే కృష్ణ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. వైద్యనీతి పాటించి ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనఃశాంతిగా వెళ్లిపోయేలా చేశామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కాంటినెంటల్‌ ఆస్పత్రి చైర్మన్‌, ఎండీ డాక్టర్‌ గురు ఎన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

(చదవండి: రాజకీయాల్లోనూ రాణించిన కృష్ణ.. ఎన్టీఆర్‌కు ధీటుగా ప్రచారం!)

‘గుండెపోటు రావడంతో సోమవారం ఉదయం కృష్ణ ఆస్పత్రికి వచ్చారు. ఆయనను వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించాం. మొదటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. డయాలసిస్‌ కూడా చేశాం. సోమవారం సాయంత్రం కృష్ణ ఆరోగ్యం మరింత విషమించింది. ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అందించినా ఫలితం ఉండదని నిర్ధారణకు వచ్చాం.

(చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్‌ చేయలేరేమో!)

దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కొన్ని గంటలు మనఃశాంతిగా వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. మంగళవారం తెల్లవారుజామున 4.09గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ విషయంలో మేం వైద్యనీతి పాటించాం. ఆయన కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాం. కృష్ణ భౌతికకాయాన్ని వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించాం’ అని డాక్టర్‌ గురు తెలిపారు.

మరిన్ని వార్తలు