కరోనా: కూరలమ్ముకుంటున్న బాలీవుడ్‌ నటుడు

25 Jul, 2020 19:22 IST|Sakshi

భువనేశ్వర్‌: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికులనుంచి,సెలబ్రిటీలదాకా అందరినీ సంక్షోభంలో పడేసింది. ప్రధానంగా సినీపరిశ్రమ దాదాపుగా మూత పడిన పరిస్థితుల్లో ఒడిశాకు చెందిన బాలీవుడ్ నటుడు కార్తికా సాహూ బాధితుడిగా మారారు.  నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోవడం,  చాలా ప్రొడక్షన్స్‌ నిలిచిపోవంతో  కూరగాయాలను అమ్ముకుంటూ జీవనం సాగించాల్సి పరిస్థితి ఏర్పడింది. (ఆ కథనంపై చలించిన సోనూసూద్‌)

ఒడిశా కేంద్రాపాడ జిల్లాలోని గరద్పూర్‌కు చెందిన సాహూ 17 సంవత్సరాల వయసులో 2014లో బాలీవుడ్‌లో‌ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబై వెళ్ళాడు. కొన్నాళ్లు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ లాంటి  ప్రముఖులకు బాడీగార్డ్‌గా పనిచేశాడు చివరకు 2018లో అతని కల సాకారమైంది. మెల్లిగా అవకాశాలు రావడం మొదలైంది. కానీ ఇంతలోనే కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా  ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాడు. చాలా సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలలో గుర్తించదగిన పాత్రలను పోషించాననీ, ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్‌తో రాబోయే చిత్రం  'సూర్యవంశి'లో ఫైట్ సీక్వెన్స్ కూడా ఉందని సాహూ చెప్పు కొచ్చారు. 

దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ముందు జైపూర్లో ఒక షూటింగ్‌లో పాల్గొన్నానని, ఇక ఆ తరువాత పని దొరకకపోవడంతో ఒడిశాలోని ఇంటికి తిరిగి చేరుకున్నానని తెలిపాడు. అప్పటినుంచీ పొదుపు చేసిన డబ్బులతో కుటుంబాన్ని పోషించానని వెల్లడించాడు. ముఖ్యంగా మెడికల్‌ ఎమర్జీన్సీకి చాలా డబ్బు ఖర్చయిపోయిందని వాపోయాడు. చివరికి రాజధాని నగరం భువనేశ్వర్‌కు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో కూరగాయల విక్రయం ద్వారా పొట్ట పోషించుకుంటున్నామన్నాడు. అయితే పరిస్థితులు చక్కబడిన తరువాత మళ్లీ బాలీవుడ్‌లోతనకు అవకాశాలు తప్పక లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పటి వరకు మనుగడ కోసం కష్టపడక తప్పదని  సాహు పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తలు