ఆరుగురికి వచ్చినా.. ఆదుర్దా పడలేదు

8 May, 2021 10:09 IST|Sakshi

పాజిటివ్‌ని పాజిటివ్‌గానే ఎదుర్కొన్నాం

సినీహీరో కమల్‌ కామరాజ్‌ కోవిడ్‌ అనుభవాలు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వచ్చిందని బెంబేలెత్తిపోవద్దు. ఎర్లీ డిటెక్షన్, ఇమ్మీడియట్‌ మెడికేషన్‌తో పాటు సానుకూల దృక్పథం (పాజిటివ్‌ ఆటిట్యూడ్‌)తో మహమ్మారిని ఎదుర్కొందాం అంటున్నారు సినీనటుడు కమల్‌ కామరాజ్‌. గత నెలలో కుటుంబ సమేతంగా కోవిడ్‌ బారిన పడి కోలుకున్న ఆయన.. ‘సాక్షి’తో తన అనుభవాలు పంచుకున్నారు.. 

‘షూటింగ్‌ కోసం డెహ్రాడూన్, చెన్నై వెళ్లొచ్చా. కోవిడ్‌ టెస్ట్‌ చేసుకుంటే నెగెటివ్‌ వచ్చింది. సెకండ్‌ వేవ్‌ కారణంగా భోపాల్‌లో పరిస్థితి బాగోకపోవడంతో మా అత్తా మామల్ని హైదరాబాద్‌ తీసుకువచ్చాం. మా మామగారికి 75 ఏళ్లు, అత్తయ్యకు 70 వరకూ ఉంటాయి. బీపీ, షుగర్‌ ఉన్నాయి. ఎందుకైనా మంచిదని లక్షణాలు లేకపోయినా వారు రాకముందే మరోసారి టెస్ట్‌కు శాంపిల్‌ ఇచ్చా. మా అత్తామామలు ఇంటికి వచ్చిన రోజే నా రిజల్ట్‌ పాజిటివ్‌ అని వచ్చింది. ఆ మరుసటి రోజే ఎవరికీ ఎలాంటి లక్షణాలు లేకపోయినా నా తల్లిదండ్రులు, నా భార్య, అత్తా, మామ, పని వాళ్లిద్దరికీ కూడా టెస్ట్‌ చేయించాను. మా పేరెంట్స్‌కి తప్ప అందరికీ పాజిటివ్‌. 

లక్షణాల్లేవని నిర్లక్ష్యం చేయలేదు 
డాక్టర్‌ని సంప్రదించి అందరికీ మందులు తెప్పించేశా. ఎర్లీ డిటెక్షన్‌.. ఇమ్మీడియట్‌ మెడికేషన్‌ మాకు చాలా హెల్ప్‌ అయింది. వాస్తవానికి మా ఇంట్లోవాళ్ల పరీక్ష నివేదిక రాకముందే మందులు ప్రారంభించాం. ఆందోళన పడకుండా మంచి ఆహారం తీసుకున్నాం. నాకు 2 రోజుల పాటు స్వల్ప జ్వరం తప్ప మరేమీ ఇబ్బంది కలగలేదు. లక్షణాలు పెద్దగా లేకున్నా కోర్సు ప్రకారం చికిత్స తీసుకున్నాం. మా అత్తామామ వ్యాక్సిన్‌ తీసుకుని ఉండటంతో వారు కూడా ఇబ్బంది పడకుండానే బయటపడ్డారు. నా అనుభవం ప్రకారం చెప్పేదేమిటంటే..పాజిటివ్‌ వచ్చిందంటే వెంటనే మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా పరీక్షలు చేయించి మందులు ప్రారంభించాలి. సోషల్‌ మీడియాలో వచ్చే వాటితో ప్రయోగాలు చేయకూడదు. కరోనాను సీరియస్‌గా తీసుకుని, కేర్‌ ఫుల్‌గా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే క్యూర్‌ అయిపోతుంది.

మరిన్ని వార్తలు