తొలి భారతీయ ఆస్కార్ విజేత కన్నుమూత

15 Oct, 2020 19:43 IST|Sakshi

సాక్షి,ముంబై: భారతదేశానికి  తొలి ఆస్కార్  అవార్డును అందించిన ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియా (91) ఇక లేరు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె రాధిక గుప్తా ధృవీకరించారు. ఎనిమిది సంవత్సరాల క్రితం, మెదడులో కణితి కారణంగా గత మూడేళ్లుగా, ఆమె మంచానికే పరిమితయ్యారని తెలిపారు. చివరకు గురువారం తెల్లవారు ఝామున నిద్రలోనే కన్నుమూసినట్టు ఆమె చెప్పారు. దక్షిణ ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో తమ తల్లి అంత్యక్రియలను  పూర్తి చేసినట్టు రాధిక ప్రకటించారు.

1982లో గాంధీ చిత్రానికి దుస్తుల రూపకల్పనలో ఆమె కృషికి గాను కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. తద్వారా ఆస్కార్ అకాడమీ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయురాలిగా అథియా ఘనత దక్కించుకున్నారు. కొల్లాపూర్‌లో జన్మించిన అథియా ఈవ్స్ వీక్లీ సహా బొంబాయిలోని వివిధ మహిళా పత్రికలకు ఫ్రీలాన్స్ రచయితగావృత్తిని ప్రారంభించారు. పత్రిక ఎడిటర్ కోరిక మేరకు దుస్తులను డిజైన్ చేసిన భాను క్రమంగా తనలోని నైపుణ్యానికి పదును పెట్టి డిజైనర్‌గా  రాణించారు.

అలా ఆమె కెరీర్ గురుదత్ సూపర్ హిట్ మూవీ సీఐడీ (1956)లో ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్‌గా కరియర్ ప్రారంభించారు. పాయసా (1957), చౌద్విన్ కా చాంద్ (1960)  సాహిబ్ బీబీ ఔర్ గులాం (1962) తదితర గురుదత్ చిత్రాలకు పనిచేసి ఖ్యాతి గడించారు. ఆ తరువాత 1991లో,  లగాన్ (2002)  చిత్రానికి రెండు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 50 సంవత్సరాల కెరీర్లో 100 చిత్రాలు, అనేక అవార్డులను అథియా అందుకున్నారు. తన మరణం తరువాత తన కుటుంబం ట్రోఫీని జాగ్రత్తగా చూసుకోలేదని భావించి తన అకాడమీ అవార్డును ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.15 డిసెంబర్ 2012 న, ట్రోఫీని  అకాడమీకి  తిరిగి ఇచ్చారు. అంతేకాదు ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్‌  అనే పుస్తకాన్ని కూడా ఆమె రాశారు. 

మరిన్ని వార్తలు