కృష్ణా నగర్‌ మూగబోయింది..

29 Jul, 2020 07:18 IST|Sakshi

ఎటు చూసినా కష్టాలు.. కన్నీళ్లే 

సందడిలేని  పూర్ణా టిఫిన్స్, పొట్టి వీరయ్య బంక్‌లు.. 

కళ తప్పిన ఇందిరానగర్, గణపతి కాంప్లెక్స్‌లు 

సినిమా షూటింగ్‌లన్నీ ప్యాకప్‌ 

క్లాప్‌ కోసం కార్మికుల ఎదురుచూపు 

సనత్‌నగర్‌:  సినీ కళాకారుల కలలధామం.. 24 క్రాప్ట్స్‌కు ఆశల దీపం... కృష్ణానగర్‌ మూగబోయింది. నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ఉండే ఆ బస్తీ సినిమా షూటింగ్‌లతో పాటే నాలుగు మాసాల క్రితమే ప్యాకప్‌ అయిపోయింది. కరోనా మాటున కనుమరుగైన వెండి తెర వెలుగులు మాదిరిగానే సినీ కార్మికుల జీవితాలు సైతం మసకబారిపోయాయి. కోడి కూయకముందే అందంగా ముస్తాబై రోడ్డెక్కే జూనియర్‌ ఆర్టిస్ట్‌లు..సాయంత్రమైతే రేపటి షెడ్యూల్డ్‌ ముచ్చట్లు... నవ్వులు...కేరింతలు...వారి కోసం వచ్చిపోయే వాహనాలు..ఇలా కష్ణానగర్‌ ఎప్పుడూ కళకళలాడేది. కానీ ఆ ‘కళ’ను కరోనా మింగేసింది. పూర్ణా టిఫిన్స్, మంగ

టిఫిన్‌ సెంటర్, శ్రీశ్రీ టిఫిన్స్‌...
పొట్టివీరయ్య బంకు వంటికి సినీ కార్మికులకు అడ్డాలు. బాధలు... బందీలు... కలలు...కన్నీళ్లు... ఆనందం... అభిమానం ఏది పంచుకోవాలనుకున్నా ఇక్కడికొచ్చి సింగిల్‌ చాయ్‌ కొట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు.

దాతల సహకారంతో..
సినీ వృక్షపు కొమ్మలను కరోనా తెగనరికేయడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు.   పెట్రేగిపోతున్న కరోనా భయం ఒకవైపు..షూటింగ్‌లు లేక ఛిద్రమైన జీవితాలు మరోవైపు..వెరసి రంగుల లోకాన్ని విడనాడి సొంత ఊళ్ల బాట పట్టిన వారు ఎందరో.. చేసే వృత్తిని వదల్లేక..అద్దెల భారాన్ని దిగమింగుకుని..స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు పంచే నిత్యావసరాలనే పరమాన్నంగా భావించి కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారు మరెందరో..  

సినిమానే లోకం....బతుకే సినిమాగా... 
సినిమానే లోకం అనుకుని వచ్చేవారు కొందరైతే.. బతుకునే సినిమాగా మలచుకునే వారు మరికొందరు. ఎలాగైనా... వెండితెరపై సింగిల్‌కార్డ్‌ పడాలిరా....అప్పుడే ఇంటికి తిరిగివస్తానురా మామా! అంటూ పెట్టేబేడా సర్దుకుని కృష్ణానగర్‌ ఒడిన చేరిపోతుంటారు.  సినిమానే లోకం అనుకుని వచ్చేవారు రాజీపడి బతుకునే సినిమాగా మలచుకుంటున్నవారు కష్ణానగర్‌ గుండెను టచ్‌ చేస్తే తారసపడతారు. సినిమా షూటింగ్‌ ఉంటే పండగే...లేదంటే దండగే...అన్నట్లు ఉంటాయి వీరి జీవితాలు. అందుకే వేషాల పైనే ఆధారపడకుండా 24 ఫ్రేమ్స్‌లోని ఏదోఒక రీల్‌ను ఎంచుకుని తమ బతుకు సినిమాను నడిపిస్తుంటారు. రంగుల ప్రపంచంలో అడుగిడిన వారు 24 శాఖల్లో ఏదోఒక దానికి పరిమితమై జీవనం కొనసాగిస్తుంటారు. కానీ కరోనా వారి కలలన్నింటినీ కల్ల చేసింది. చాలామందిని మళ్లీ పెట్టెబేడా సర్ధుకుని సొంతూళ్లకు వెళ్లేలా చేసింది. 

ఆ స్పాట్‌లన్నీ బోసిపోయి... 
24 శాఖలకు చెందిన వారిది ఒక్కొక్కరిదీ ఒక్కోస్పాట్‌. తెల్లవారకముందే తమ తమ అడ్డాల వైపు వారి అడుగులు కదులుతాయి. అప్పటికే వాహనాలు రెడీగా ఉంటాయి. వారు రావడంతోనే షూటింగ్‌ స్పాట్‌ల వైపు వాహనాలు దూసుకుపోతుంటాయి. ముఖ్యంగా కృష్ణానగర్‌లో డైరెక్టర్ల స్పాట్‌ అంటే గణపతి కాంప్లెక్స్‌. ఉదయం నాలుగయ్యిందంటే ఇక్కడ డైరెక్టర్స్, కో–డైరెక్టర్స్‌తో పాటు వేషాల కోసం వారి చుట్టూ తిరిగే వారు తారసపడుతుంటారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ల స్పాట్‌ ఇందిరానగర్‌ గడ్డ. కృష్ణానగర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళ్లే మూలమలుపులో ఉన్న ఈ గడ్డే జూనియర్‌ ఆర్టిస్ట్‌ల ఆశల అడ్డా. పాత వారైతే సరేసరి...కొత్త వారైతే మాత్రం ఏజెంట్లను ప్రసన్నం చేసుకుంటేనే వేషం మరి.

అలా ఒకరోజు...రెండు రోజులు కాదు...  నెలల తరబడి వేషాల కోసం తిరిగేవారు కూడా ఇక్కడ కనిపిస్తుంటారు. ఇక స్టంట్స్‌కు వేదిక అంటే స్థానిక బాబురావు లాడ్జి ఎదుట లైన్‌లో గల కార్యాలయమే. ఇలా కాస్ట్యూమ్, మేకప్‌మేన్‌లకు వేర్వేరుగా ఉన్న స్పాట్‌ల వద్దకు వచ్చి వాహనాల్లో షూటింగ్‌ ప్రాంతానికి వెళ్తుంటారు. ఉదయం 4 నుంచి 8 గంటల వరకు వారి సందడి ఇక్కడ ఉంటూనే ఉంటుంది. స్పాట్‌లు వేరైనా మాదంతా ‘సినిమా’ లోకమే అంటారు వీరు. మరి ఇప్పుడు. ఆ ’సీన్‌’ను కరోనా రివర్స్‌ చేసేసింది. ఎవరెక్కడ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. 

నాలుగు నెలల క్రితమే మా జీవితాలు ప్యాకప్‌ ... 
 కరోనాకు ముందు ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్నట్లుగా చేతి నిండా పని ఉండేది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచీ సినిమా, సీరియల్‌ షూటింగ్‌లు ప్యాకప్‌ అయినట్టే మా పనులు కూడా ప్యాకప్‌ అయిపోయాయి. మా యూనియన్‌లో 40–50 శాతం మంది ఇళ్ల అద్దెలు చెల్లించలేక, కరోనా భయంతో ఊర్లకు వెళ్లిపోయారు.  ఈ రోజు కాకపోతే రేపైనా షూటింగ్‌లు జరగకపోవా అన్న ఆశతో ఇంకొందరు వేచి చూస్తున్నారు. 

రంగాల వైపు వెళ్ల లేరు. కష్టమైనా..
నష్టమైనా సరే అప్పోసొప్పో చేసి బతుకును వెళ్లదీస్తూ షూటింగ్‌లు జరిగే వరకు వేచి చూడక తప్పదు. చిరంజీవి ఛారిటబుల్‌ సంస్థ నుంచి ఇటీవల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం మాకు  కొంతవరకు ఊరటనిచ్చింది. అవే ఇప్పటివరకు మా ఆకలిని తీర్చాయి.   – సుధీర్, కాస్ట్యూమర్‌ 

అందరి పరిస్థితి అగమ్యగోచరమే... 
సినిమా షూటింగ్‌లు ఉంటే చేతి నిండా పని ఉండేది. ప్రొడక్షన్‌లో ఉండేవారందరికీ క్యారియర్లు అందిస్తుంటాను. కరోనాతో షూటింగ్‌లు బంద్‌ కావడంతో మా క్యారియర్లు కూడా అటకెక్కాయి. వ్యాపారం లేక పూట గడవడమే కష్టంగా మారింది. మా కింద పనిచేసే సిబ్బందికి కూడా ఉపాధి కరువైంది. ఐదు నెలలుగా ఇదే పరిస్థితి ఉంటే బతికేదెట్టా. అక్కడికే పలువురు హీరోలు, మానవతామూర్తులు ఆదుకుంటున్నారు. వారు మాత్రం ఎన్ని రోజులు ఆదుకుంటారు. మళ్లీ  షూటింగ్‌లు మొదలైతే తప్ప ఉపాధి దొరకదు. సినిమాపై ఆధారపడ్డ వారి అందరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. –నాగమణి, సినిమా క్యాటరింగ్‌ సర్వీసెస్‌              


కోలుకోలేని దెబ్బ... 
సినిమా ఫీల్డ్‌లో విగ్‌లకు డిమాండ్‌ బాగానే ఉంటుంది. అయితే నాలుగు నెలలుగా షూటింగ్‌లు ఆగిపోవడంతో మా వ్యాపారం కూడా పూర్తిగా పడిపోయింది. షాపు అద్దెలు, ఇంటి అద్దెలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. కరోనా కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఊహించలేదు. ఆ విభాగం ఈ విభాగం అని తేడా లేకుండా సినిమాలోని 24 శాఖలకు చెందిన కార్మికుల పొట్ట కొట్టింది. ప్రభుత్వం యూనియన్ల వారీగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి సహాయం అందిస్తే బాగుంటుంది. లేనిపక్షంలో మేము ఎప్పుడు కోలుకుంటామో తెలియడం లేదు.  –బ్రహ్మాజీ, విగ్స్‌ సప్లయర్‌ 

సాఫీగా సాగే జీవితంపై పిడుగు పడింది  
 కరోనా ముందు వరకు జీవితం సాఫీగా సాగిపోయింది. మా యూనియన్‌లో దాదాపు 650 మంది వరకు ఉంటే సగం మంది ఇక్కడ పనులు లేక ఊర్లకు వెళ్లిపోయారు. ఇక్కడేమో ఇంటి అద్దెల కోసం యజమానులు పీడిస్తున్నారు. కొంతమంది షూటింగ్‌లు ఉన్నప్పుడే అద్దెలు ఇవ్వండంటూ మానవత్వంతో వ్యవహరిస్తున్నారు. మరికొంత మంది అద్దె ఇవ్వండి లేదా ఖాళీ చేయండి అంటూ హుకుం జారీ చేస్తుండటం బాధాకరం. షూటింగ్‌లు బంద్‌ అయ్యాయి కదా? కనీసం బ్రైడల్‌ మేకప్‌లు చేసుకుందామన్నా పెళ్లిళ్లు  కూడా వాయిదా వేసుకుంటున్నారు. దీంతో మేకప్‌మెన్ల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. హీరో, హీరోయిన్లకు మేకప్‌లు వేసేవారు మా యూనియన్‌ సభ్యుల పరిస్థితిని వివరించి కొంతమేర సహాయం చేసేలా చూశారు. కానీ ఇంటి అద్దెలను మాత్రం ఎలా చెల్లించాలో అర్థం కావడంలేదు.     –సునీల్, మేకప్‌ ఆర్టిస్ట్‌ 


అద్దెలు భారం, కరోనా భయంతో ఊరికి వచ్చేశా... 
కరోనా భయంతో బయటకు రావాలంటే బయమేస్తోంది. షూటింగ్‌లో ఎవరికి కరోనా ఉంటుందోనన్న ఆందోళనతో ఎవరూ రావడం లేదు. నేను కూడా ఊరికి వచ్చేశా. మా యూనియన్‌లో 250 మంది వరకు ఉంటే 50 శాతం వరకు ఊర్లలోనే ఉన్నారు. హైదరాబాద్‌లో కరోనా భయంతో పాటు అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలు ఊర్లోనే ఉంటే బెటర్‌ అనిపించింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, హీరోలు కొంతమేరకు ఆదుకున్నారు. ప్రభుత్వం కూడా మా పై దయదలిస్తే బాగుంటుంది.    –మహిపాల్, లైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌

కష్టాలతో ’ఫైట్‌’ చేయాల్సి వస్తోంది... 
సినిమాలో ఫైటింగ్‌లతో జీవితాన్ని నెట్టుకువచ్చే మేము ఇప్పుడు కరోనా తెచ్చిన కష్టాలతో ఫైట్‌ చేయాల్సి రావడం దురదృష్టకరం. మా యూనియన్‌లో 250 మంది వరకు ఉంటే చాలా మంది సొంత ఊర్లకు వెళ్లిపోయారు. ఉన్నవారు పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్‌లు నిలిచిపోవడంతో చిల్లిగవ్వ ఆదాయం కూడా లేదు. చిరంజీవి సీసీసీ నుంచి నెలకు 2,000 చొప్పున ఇవ్వడంతో పాటు కొంతమంది హీరోలు, నటులు దయదలచి నిత్యావసరాలను అందించడంతో కుటుంబం గడుస్తోంది.  షూటింగ్‌లు జరిగే వరకు తాము దాతలపై ఆధారపడక తప్పదేమో?  –శ్రీనివాస్, స్టంట్‌ ఫైటర్‌               
 కరోనా సినీ కార్మికుల జీవితాలను చిదిమేసింది... 
కరోనా వచ్చి మా సినీ కార్మికుల జీవితాలను ఛిద్రం చేసింది. కుటుంబం గడవడమే కష్టంగా మారింది. చాలామంది ఊర్లకు వెళ్లిపోగా...,  ఇంకొందరు అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఏదో ఒకచోట చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. నేను  మటుకు ఏదీ చేయలేక ఖాళీగా ఉన్నా. మార్చి నుంచి జీతాలు లేవు. యూనియన్‌ వారు అందించిన నిత్యావసర సరుకులు, కొద్దిపాటి సహాయంతో నెట్టుకువస్తున్నాం. కరోనా భయంతో ఆర్టిస్ట్‌లు రావడానికి కూడా భయపడుతుండటంతో  షూటింగ్‌లు జరగడం లేదు. పూర్వ వైభవం ఎప్పటికి వస్తుందో అర్థం కావడం లేదు. –శ్రీను, ప్రొడక్షన్, మేనేజర్‌        

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు