లాక్‌డౌన్‌పై డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

29 Apr, 2021 15:59 IST|Sakshi

కరోనా సెకండ్ వేవ్‌….దేశంలో కనీవినీ ఎరుగని విషాదాన్ని నింపుతోంది. ఆస్పత్రుల్లో ఒక్క బెడ్‌ కోసం రోగులు అలమటిస్తున్నారు. ఆక్సిజన్‌ అందక జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజు రోజుకి పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షల్లో పెగుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించాయి.

తెలుగు రాష్ట్రాల్లో కూడా నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. రానున్న రెండు, మూడు వారాలు ఎంతో క్లిష్టంగా ఉండబోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయనే వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు భారత్ లో లాక్ డౌన్ విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ లాక్‌డౌన్‌ కచ్చితంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ లాక్ డౌన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్‌ ఉన్నా లేకున్నా రానున్న కొద్ది రోజులు ఇంట్లోనే ఉందామని ఆయన పిలుపునిచ్చారు.

‘లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా.. రానున్న రెండు వారాలు వ్యక్తిగతంగా లాక్‌డౌన్‌ పాటిద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు లాక్‌డౌన్‌ సమాధానం కాదని ఎవరైతే అంటున్నారో వాళ్లందరూ ఒక్కసారి వెళ్లి ఆసుపత్రులను చూసి రండి. అలాగే గడిచిన నెల రోజుల నుంచి వైద్యులు ఎలా సేవలందిస్తున్నారో చూడండి. కాబట్టి, తప్పనిసరిగా మనందరం వ్యాక్సిన్‌ వేయించుకుందాం. వైద్యులకు కొంత రిలీఫ్‌ని అందిద్దాం’ అని నాగ్‌అశ్విన్‌ ట్వీట్‌ చేశారు. ఇక సినిమా విషయాలకొస్తే నాగ్‌ అశ్విన్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరక్కెతున్న ఈ సినిమాలో దీపికా దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు