ఈ ఏడాది మరీ ఇంత దారుణమా: అశ్విన్‌

25 Sep, 2020 15:52 IST|Sakshi

చెన్నై:  భారతదేశం గర్వించదగ్గ అతికొద్ది మంది గాయకుల్లో ఒకరైన గాన గంధర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కన్నుమూయడంపై పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అటు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు పలువురు క్రికెటర్లు కూడా సంతాపం తెలుపుతున్నారు. తన సుమధుర గాత్రంతో ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్న ఎస్పీ బాలు ఇక లేరనే వార్తపై క్రికెటర్‌ రైనా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు.‘ ఒక దిగ్గజ గాయకుడ్ని కోల్పోవడం బాధాకరం. ఈ వార్త విని తీవ్రంగా కలత చెందా.  మీ గాత్రం రాబోవు తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ఇదే నా సంతాపం. ఓం శాంతి’ అని రైనా ట్వీట్‌ ద్వారా సంతాపం తెలిపాడు. 

ఇక మరో భారత క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన ట్వీట్‌లో ఎస్పీ బాలుకి సంతాపం తెలుపుతూ.. ‘ ఈ ఏడాది మరీ ఇంత దారుణంగా ఉంది. రోజు రోజుకీ ఇంతలా దిగజారిపోతోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు చేకూరాలని ప్రార్థిద్దాం’ అని ట్వీట్‌ చేశాడు. నిన్న గురువారం ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌, వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌ గుండె పోటుకు గురై కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ కామెంటరీ వ్యవహారాల్లో భాగంగా ముంబైలో ఉన్న డీన్‌జోన్స్‌ హఠాన్మరణం పొందారు. ఈ రోజు ఎస్పీ బాలు కన్నుమూయడంతో ఈ ఏడాది చోటుచేసుకున్న పరిస్థితులపై కలత చెందుతూ ట్వీట్‌ చేశాడు.(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత)

చాలా బాధాకరం: వాషింగ్టన్‌ సుందర్‌
బాలు సార్‌ లేరనే వార్త వినడం చాలా బాధాకరం. మీ గాత్రం, మీ పాటలు మాతో ఎప్పుడూ ఉంటాయి. వచ్చే తరానికి కూడా మీ పాటలు స్ఫూర్తిగా నిలుస్తాయి. మేము మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం

మీ పాటలతో మీరు మాతోనే: ధావన్‌
మీ పాటలు ఎప్పుడూ మాతోనే ఉంటాయి. పాటల రూపంలో మీరు మాతోనే ఉంటారు. ఆయనకు నా ప్రగాఢ సానుభూతి. 

మీరు లేని లోటు పూడ్చలేనిది: ప్రజ్ఞాన్‌ ఓజా
బాలు గారు లేరనే వార్త నన్ను షాక్‌ గురి చేసింది. మీరు లేని లోటు పూడ్చలేనిది. మీరు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోవడం పెద్ద లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

పీడకల వెంటాడుతోంది: రవిశాస్త్రి
పీడకల వెంటాడుతూనే ఉంది. ఈరోజు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం లేరన వార్తను వినడం బాధనిపించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయను సంగీతాన్ని ప్రేమిస్తే.. సంగీతం అతన్ని ప్రేమించింది. ఓం శాంతి.

మరిన్ని వార్తలు