ఫ్యాట్‌‌ సర్జరీ.. సగం రక్తం కోల్పోయా: నటి

8 Jan, 2021 16:06 IST|Sakshi

వాషింగ్టన్‌: సినిమాలు, యాడ్‌లు అన్ని స్త్రీని ఓ లైంగిక వస్తువుగా చూపిస్తున్నాయి. ఆమె శరీరానికి ఒక ప్రత్యేక కొలతలు.. రంగును సెట్‌ చేశాయి. ఇక ప్రపంచంలోని మెజారిటీ మహిళలు ఆ కొలతల్లో సెట్ కాకపోతే.. ఆ రంగు లేకపోతే తాము అసలు మనుషులమే కాదనే భావంలోకి దిగజారిపోయాలా వారి ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. అసలు స్త్రీ అంటేనే ఇలా ఉండాలి.. లేదంటే వారి జీవితం ఎంత ప్రమాదంలో పడుతుందో అనే భావాన్ని ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ఈ విషయం పట్ల సమాజంలో చైతన్యం కలుగుతుంది. మహిళలు ఈ బంధనాలు తెంచుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో టీవీ నటి, అమెరికన్‌ ప్రసిద్ధ మ్యాగ్‌జైన్‌ ప్లేబాయ్‌ ఫౌండర్‌ హ్యూ హెఫ్నర్‌ మూడో భార్య క్రిస్టల్‌ హెఫ్పర్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చలామణి అవుతున్న అందం ప్రమాణాల గురించి.. వాటి వల్ల మహిళల్లో పాతుకుపోయిన అభద్రతాభావం గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. 

‘గతేడాది అక్టోబర్‌ 16న నాకు ఫ్యాట్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్జరీ జరిగింది. కానీ అది సవ్యంగా కొనసాగలేదు. ఈ శస్త్ర చికిత్స వల్ల నేను నా శరీరంలో సగం రక్తాన్ని కోల్పోయాను. చివరకు రక్తం ఎక్కించకునే పరిస్థితులు తలెత్తాయి. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే ఆహారం తీసుకోగల్గుతున్నాను. ప్రస్తుతం నాకు బాగానే ఉంది. ఒకప్పుడు అందం అని భ్రమించి.. ఈ ఫీల్డ్‌లో పని చేయడం కోసం తప్పని సరి పరిస్థితుల్లో 2016 సంవత్సరంలో నా శరీరంలోకి కొన్ని విషపూరిత పదార్థాలను, ఇంప్లాట్స్‌ని పంపించాను. వాటి వల్ల నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. సర్జరీతో వీటన్నింటిని తొలగించాను. ఈ సంఘటనలు తొలిసారి నాకు ఒక పాఠాన్ని నేర్పాయి. మరో విషయం ఏంటంటే మనం నేర్చుకునే వరకు విశ్వం ఈ పాఠాలను పంపుతూనే ఉంటుందని నేను గ్రహించాను. ఈ అనుభవం తర్వాతే నేను సహజంగా మనం మనలా ఉండటమే సరైందని మీతో చెప్పగల్గుతున్నాను’ అన్నారు క్రిస్టల్‌‌. (చదవండి: అత్యవసర సర్జరీ చేయించుకుంటున్న నటి)

A post shared by Crystal Hefner (@crystalhefner)

ఇక ప్లేబాయ్‌ మ్యాగ్‌జైన్‌, సైట్‌లో కనిపించిన క్రిస్టల్‌.. వీటన్నింటిని విషపూరిత సంస్కృతితో పోల్చారు. ఇక సినిమాలు మహిళలను తమను చూసుకుని తామే భయపడే స్థితికి తీసుకెళ్లాయని వాపోయారు. సినిమాలు, ప్రకటనలు, సోషల్‌ మీడియా తదితర చెత్త, శారీరకంగా నకిలీ వ్యక్తులు మహిళల పరిస్థితులను మరింత దిగజార్చయని.. వాటిలో తాను కూడా ఉన్నానని అంగీకరించారు. ఇవన్ని మహిళల్ని కేవలం లైంగిక వస్తువుగా మాత్రమే చూపిస్తాయని ఆరోపించారు. ఇక గత పదేళ్లుగా తన బాహ్యరూప అందం మీదనే తన విలువ, జీవనాధారం ఆధారపడ్డాయని తెలిపారు క్రిస్టల్‌. ఇక ఈ రోజు తన బాహ్యరూపంతో సంబంధం లేకుండా తాను ఎంత విలువైనదో అనే విషయం తెలుసుకున్నానని.. బాహ్యసౌందర్యంతో సంబంధం లేకుండా తనను తాను ప్రేమించుకుంటానని.. గౌరవించుకుంటానన్నారు క్రిస్టల్‌. (చదవండి: యువతి బద్ధకం ఎంత పని చేసింది!)

ఇక తర్వాతి తరాలను తలుచుకుంటే తనకు ఎంతో బాధగా ఉందని... వారంతా కేవలం డబ్బు, మేకప్‌, ఫిల్టర్స్‌ అనే నకిలీ ముసుగులతో జీవించబోతున్నారని క్రిస్టల్‌ వాపోయారు. ఇప్పటికైనా మహిళలు ఈ పద్దతికి స్వస్థి పలకాలని.. బాహ్య రూపం గురించి కాకుండా ఆత్మవిశ్వాసం, తన పట్ల తనకు ప్రేమ, నమ్మకం, గౌరవం కలిగి ఉండటం ఎంత ముఖ్యమో చెప్పాలని కోరుతున్నాను అన్నారు. ఇప్పటికైనా తనకు జ్ఞానోదయం అయినందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు‌. ఇక క్రిస్టల్‌ 2012లో హ్యూ హెఫ్నర్‌ని వివాహం చేసుకుని మూడో భార్యగా ఆయన జీవితంలోకి ప్రవేశించారు. అయితే పైళ్లెన ఐదేళ్లకే అంటే 2017లో తన 91వ ఏట హ్యూ మరణించారు. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటున్నారు. 

మరిన్ని వార్తలు