Waheeda Rehman: పెళ్లైన హీరోతో ప్రేమలో..చివరకు అలా.. వహీదా రెహమాన్‌ బ్రేకప్‌ స్టోరి

26 Sep, 2023 18:50 IST|Sakshi

‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా..’ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్‌ నటి వహీదా రెహమాన్‌ని ‘దాదా సాహేబ్‌ ఫ్యాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం’ వరించింది. భారతీయ సినీ పరిశ్రమకు 5 దశాబ్దాలుగా సేవలు అందించినందుకుగాను ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. వెండితెరపై ఎన్నో పాత్రలను పోషించిన అలరించిన వహిదా.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి చేరింది. సినిమా అవకాశాల కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఒకెత్తు అయితే... స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన తర్వాత ఆమె పడిన బాధ మరో ఎత్తు.  గాఢంగా ప్రేమించిన వ్యక్తి.. తనను దూరం పెట్టడం.. వేరే హీరోతో ఎఫైర్‌ ఉందని ఆరోపించడం.. ఇలా తన సీనీ కెరీర్‌లో ఎన్నో బాధలను,అవమానాలను ఎదుర్కొన్నారు. 

అలా బాలీవుడ్‌ పయనం.. 
టాలీవుడ్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది వహిదా రెహమాన్‌. 1955లో ‘రోజులు మారాయి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ  మూవీలో ‘ఏరువాక సాగారో రన్నో..’పాట వహిదాకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుసగా తమిళ సినిమాలు చేసింది. ఈ క్రమంలో ఆమె దర్శకుడు గురుదత్‌ దృష్టిలో పడింది. ఆమె అందానికి, నటనకి ఫిదా అయిన గురుదత్‌ ‘సీఐడీ’ అనే సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశాడు. అలా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది వహిదా. 1956లో విడుదలైన ఆ చిత్రం..అప్పటికి అత్యధిక కలెక్షన్లను రాబట్టిన ఇండియన్‌ సినిమాగా చరిత్రకెక్కింది.

వహిదా అందానికి ముగ్ధుడైన డైరెక్టర్‌ గురుదత్‌ హీరోగా అవతారమెత్తాడు. వహిదా కోసం ‘ప్యాసా’ చిత్రంలో కూడా హీరోగా నటించాడు. వాస్తవానికి తొలుత ఆ సినిమాకు హీరో దిలీప్‌ కుమార్‌. అయితే వహిదా రెహమాన్‌ హీరోయిన్‌గా చేస్తుందని తెలియడంతో దిలీప్‌ని తప్పించి తనే హీరోగా నటించాడు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో వహిదాకి గురుదత్‌ క్లోజ్‌ అయ్యాడు. తొలుత ఇద్దరి మంచి స్నేహితులుగా కొనసాగారు. కొన్నాళ్ల తర్వాత అది ప్రేమగా మారింది. 

(చదవండి: వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే..)

ట్విస్ట్‌ ఇచ్చిన గురుదత్‌
తొలి బాలీవుడ్‌ సినిమా ఇచ్చిన గురుదత్‌.. కొన్నాళ్ల తర్వాత ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. వహిదా కూడా అతన్ని ఇష్టపడింది. అయితే అప్పటికే గురుదత్‌కు పెళ్లి అయింది. 1953లో ప్రముఖ గాయని గీతాదత్‌ని గురుదత్‌ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం వహిదాకు తెలియదు. గురుదత్‌ కూడా దాచి పెట్టాడు. కానీ ‘ప్యాసా’ సినిమా విడుదలకు ముందే వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. ఒకనొక దశతో గురుదత్‌ భార్యకు విడాకులు ఇచ్చి వహిదాను పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి. 

భార్య కోసం ప్రేమ త్యాగం
గురుదత్‌-వహిదా రెహమాన్‌ల ప్రేమ వ్యవహారం గీతాదత్‌కు కూడా తెలిసింది. భర్తతో గొడవకు దిగింది. కొన్నాళ్ల తర్వాత పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. వేరుగా జీవించడం ప్రారంభించింది. ఫ్యామిలీ అంతా దూరం అవ్వడాన్ని గురుదత్‌ తట్టుకోలేకపోయాడు. భార్య, పిల్లలు తిరిగి తన వద్దకు రావాలంటే.. ప్రేమను త్యాగం చేయాల్సిందే అనుకున్నాడు. అందుకే వహిదాను దూరం పెట్టడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు గీతా దత్‌ తిరిగి ఇంటికొచ్చింది. గురుదత్‌ చాలా రోజుల వరకు వహిదాను మర్చిపోలేదట. ఆమె తలుచుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడని అతని సన్నిహితులు చెప్పేవారు. 

కుంగిపోయిన వహీదా
ప్రేమ విఫలం కావడంతో వహిదా కుంగిపోయింది. గురుదత్‌ని మర్చిపోవడానికి వరుస సినిమాలను ఒప్పుకుంది. నటిగా బీజీ అయింది. దేవ్‌ ఆనంద్‌తో ఎక్కువ సినిమా చేయడంతో అతనితో ప్రేమలో పడిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అదంతా ఒట్టి పుకారు మాత్రమే. గురుదత్‌ తర్వాత ఆమె ఎవరినీ ప్రేమించలేదు. 1974లో బాలీవుడ్‌ నటుడు శషిరేఖీని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సోహైల్‌ రేఖీ, కాశ్వీ రేఖీ ఉన్నారు. 2000 సంవత్సరంలో శషిరేఖీ చనిపోయాడు. ప్రస్తుతం వహిదా ముంబైలో పిల్లలతో కలిసి ఉంటోంది. 

మరిన్ని వార్తలు