Keerthy Suresh: 'దసరా మూవీ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది'

26 Mar, 2023 07:32 IST|Sakshi

మహానటి... బొద్దుగా కనిపించడానికి ప్రోస్థటిక్‌ మేకప్‌. రంగ్‌ దే... గర్భవతిగా కనిపించడానికి కడుపు చుట్టూ కుషన్‌ సాని కాయిదమ్‌... చింపిరి జుత్తు, కమిలిపోయిన చర్మం... ఇప్పుడు ‘దసరా’.. డార్క్‌ మేకప్‌. కీర్తీ సురేష్‌ ఓ ఐదారు సినిమాలు చేస్తే అందులో పైన చెప్పినట్లు లుక్‌ పరంగాను.. నటన పరంగానూ చాలెంజ్‌ చేసే పాత్రలే ఎక్కువ. ‘క్యారెక్టర్‌ కోసం ఎంత కష్టపడితే అంత ఆత్మసంతృప్తి దక్కుతుంది’ అంటారు కీర్తి. నాని, కీర్తి జంటగా శ్రీకాంత్‌ ఒదెల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ‘దసరా’ ఈ 30న రిలీజ్‌  కానుంది. ఈ సందర్భంగా కీర్తీ సురేష్‌ చెప్పిన విశేషాలు.  

మహానటి, రంగ్‌ దే, సాని కాయిదమ్‌ (తెలుగులో ‘చిన్ని’) వంటి చిత్రాల్లో చాలెంజింగ్‌ రోల్స్‌ చేశారు. ఇప్పుడు ‘దసరా’లో చేసిన వెన్నెల క్యారెక్టర్‌ పెట్టిన కష్టాల గురించి? 
వెన్నెల క్యారెక్టర్‌ ఫిజికల్‌గా కొంచెం కష్టం అనిపించింది. డార్క్‌ మేకప్‌తో కనిపిస్తాననే సంగతి తెలిసిందే. ఈ మేకప్‌ వేయడానికి గంట పట్టేది. తీయడానికి ఇంకా ఎక్కువ టైమ్‌ పట్టేది. చాలా ఓపిక అవసరం. ఇక బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌ కాబట్టి లొకేషన్లో ఒకటే దుమ్ము. ఇలా ఫిజికల్‌ కష్టాలు చాలానే. ఇక నటనపరంగా చాలెంజ్‌ ఏంటంటే.. ఈ చిత్రంలో తెలంగాణ ప్రాంతానికి  చెందిన అమ్మాయిని కాబట్టి ఇప్పటివరకూ చేసిన పాత్రలకన్నా వ్యత్యాసం చూపించాల్సి వచ్చింది. 

తెలంగాణ యాసని పట్టుకోగలిగారా? 
నిజానికి దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ కథ చెప్పినప్పుడు నాకస్సలు అర్థం కాలేదు. నాలుగు గంటలు ఓపికగా కథ చెప్పారు. అయినా తికమకగానే అనిపించింది. మరోసారి చెప్పాక అర్థం అయింది. అలాగే తెలంగాణ యాసలో డైలాగులు పలకడానికి కాస్త కష్టం అనిపించింది. కొన్ని రోజులు ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత పట్టుకోగలిగాను. శ్రీకాంత్‌ ఓదెల అసోసియేట్‌ శ్రీనాథ్‌కు తెలంగాణ యాస మీద పట్టుంది. ఆయనే నేర‍్పించారు. అలాగే ఒక ప్రొఫెసర్‌ చిన్న చిన్న వివరాలను కూడా యాడ్‌ చేశారు. 

డబ్బింగ్‌ చెప్పారా? ఇంతకుముందు క్యారెక్టర్లకు చెప్పినంత త్వరగా చెప్పగలిగారా? 
నా గత క్యారెక్టర్స్‌కి మూడు రోజుల్లో డబ్బింగ్‌ పూర్తి చేసేదాన్ని. వెన్నెలకు చెప్పడం అంత సులువు కాదు. ఈ పాత్రకు ఐదారు రోజులు పట్టింది. 

ఇప్పటివరకు చేసిన పాత్రలకన్నా ‘వెన్నెల’ క్యారెక్టర్‌కే ఎక్కువ శ్రమపడ్డారనుకోవచ్చా? 
అలా ఏం కాదు. శ్రమ పెట్టిన పాత్రల్లో ఇదొకటి. అయితే ఈ సినిమా చేసేటప్పుడు నాకు చాలా  సందర్భాల్లో ‘మహానటి’ గుర్తొచ్చింది. 

‘మహానటి’ గుర్తుకు రావడానికి కారణం? 
జనరల్‌గా ఒక సినిమా చేసినప్పుడు ఒక ఫీల్‌ ఉంటుంది. ఆ సినిమా పూర్తయినా దానితో ఒక ఎమోషనల్‌ కనెక్షన్‌ ఉంటుంది. అన్ని సినిమాలకూ ఇలా జరుగుతుందని చెప్పను. ‘మహానటి’ విషయంలో అలాంటి ఓ కనెక్షన్‌ ఉండేది. ఇప్పుడు ‘దసరా’కి ఆ ఫీల్‌ వచ్చింది. అందుకే ‘దసరా’ చేస్తున్నప్పుడు ‘మహానటి’ వైబ్స్‌ వచ్చాయన్నాను. 

అంటే.. ఆ సినిమాకి వచ్చినట్లే ‘దసరా’కి కూడా మీకు జాతీయ అవార్డు వస్తుందనుకోవచ్చా? 
యాక్చువల్‌గా ‘మహానటి’కి అవార్డుని ఆశించలేదు. వచ్చింది... చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు ఈ సినిమాకి కూడా అవార్డులు ఎదురు చూడటంలేదు. నేను ఏ సినిమా చేసినా బెస్ట్‌గా చేయాలనుకుంటాను. ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను.. అంతే. 

ఈ సినిమాలో ‘చమ్కీల అంగీలేసుకొని...’ పాట చాలా పాపులర్‌ అయ్యింది.. ఇది ముందే ఊహించారా? 
ఆ పాట వినగానే అన్ని పెళ్లి వేడుకల్లో ఇదే పాట మారుమ్రోగుతుందని అనుకున్నాం. పాటలో ఆ వైబ్రేషన్‌ ఉంది. లిరిక్స్‌ చాలా బాగుంటాయి. ట్యూన్‌ అద్భుతంగా కుదిరింది. పెద్ద హిట్‌ అవుతుందని అనుకున్నాం. మేం ఊహించినదానికంటే పెద్ద విజయం సాధించింది. 

శ్రీకాంత్‌ ఓదెల గురించి.. 
‘దసరా’ కథని శ్రీకాంత్‌ అద్భుతంగా రాసుకున్నారు. ఏ పాత్ర ఎలా ఉండాలో అయనకి చాలా క్లారిటీ వుంది. నా విషయానికి వస్తే.. కథ, నా పాత్ర, డైరెక్టర్‌ని అర్థం చేసుకుంటాను. దర్శకుడు నా నుంచి ఎలాంటి నటన కోరుకుంటున్నారో అలా చేస్తాను.  

కష్టానికి తగిన ప్రతిఫలం అంటారు.. మరి సింపుల్‌ క్యారెక్టర్లు చేసినప్పుడు తీసుకునే పారితోషకమే చాలెంజింగ్‌ రోల్స్‌కీ తీసుకుంటారా.. పెంచుతారా? 
రెమ్యునరేషన్‌ లెక్కలు వేయను. ఆ లెక్కలు వేసుకుని సినిమా ఒప్పుకోను. ఏదైనా క్యారెక్టర్‌ ఒప్పుకునే ముందు నాకు లభించే  ఆత్మసంతృప్తి గురించి మాత్రమే ఆలోచిస్తాను.  

‘దసరా’ పాన్‌ ఇండియా మూవీ... మామూలుగా పాన్‌ ఇండియా చిత్రాలకు హీరోలకు భారీ రెమ్యునరేషన్‌ ఉంటుందంటారు.. మరి ఈ చిత్రానికి మీ రెమ్యునరేషన్‌... 
అలా ఒక్క సినిమాకే పెంచేస్తామా? ఈ సినిమాతో పాన్‌ ఇండియా ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చాను. అయినా ఒక మంచి సినిమా చేసేటప్పుడు రెమ్యునరేషన్‌ పట్టింపు కాదు. ఏ సినిమాకైనా ఇంతే. ఆ సినిమా వల్ల నాకెంత ఆనందం, ఆత్మసంతృప్తి లభించాయన్నదే నాకు ముఖ్యం.  

‘మహానటి’ తర్వాత మీకు హిందీ నుంచి ఆఫర్స్‌ వచ్చినా మీరు వెళ్లలేదు.. కారణం? 
హిందీలో కొన్ని కథలు విన్నాను. అయితే ఆ కథల్లో నాది బలమైన పాత్ర అనిపించలేదు. బాలీవుడ్‌లో మంచి పాత్రలు వస్తే చేయాలనే ఉంది. కథ కూడా చాలా ముఖ్యం.  

మరిన్ని వార్తలు