లండన్‌లో పనిచేశాను..కానీ సినిమా మీద ఇష్టంతో

2 Sep, 2021 09:59 IST|Sakshi

‘‘డియర్‌ మేఘ’ ఒక భావోద్వేగంతో కూడిన ప్రేమకథ. ఇప్పటివరకూ అబ్బాయిల వైపు నుంచి వచ్చిన ప్రేమకథలు చాలా చూసి ఉంటాం. కానీ, ఇది మేఘ అనే అమ్మాయి వైపు నుంచి చెప్పే ప్రేమకథ’’ అని నిర్మాత అర్జున్‌ దాస్యన్‌ అన్నారు. మేఘా ఆకాష్, అదిత్‌ అరుణ్, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో అర్జున్‌ దాస్యన్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.

అర్జున్‌ దాస్యన్‌ మాట్లాడుతూ– ‘‘ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేసి, లండన్, హైదరాబాద్‌లో పనిచేశాను. చిరంజీవిగారి అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. సినిమాల మీద ఇష్టం పెరిగి నిర్మాతగా స్థిరపడాలనే టాలీవుడ్‌లో అడుగుపెట్టాను. ప్రొడక్షన్‌ ప్రారంభించకముందు రెండేళ్ల పాటు దర్శకుడు వీఎన్‌ ఆదిత్యతో ప్రయాణం చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను.

నా తొలి చిత్రం ఆదిత్యగారి దర్శకత్వంలోనే నిర్మించాను. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఆలస్యం వల్ల నేను తీసిన రెండో చిత్రం ‘డియర్‌ మేఘ’ తొలి చిత్రంగా విడుదలవుతోంది. ఈ సినిమా సక్సెస్‌ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. ఆ ధైర్యంతోనే ఓటీటీకి వెళ్లకుండా థియేటర్‌లో విడుదల చేస్తున్నాం. కొందరు కొత్త దర్శకులు, రచయితలు కథలు చెప్పారు.. నాలుగైదు కథలను ఓకే చేశాం. వీఎన్‌ ఆదిత్యతో తీసిన సినిమా రిలీజ్‌ తర్వాత పెద్ద హీరోతో ఓ సినిమాని ప్రకటించబోతున్నాం’’ అన్నారు. 

చదవండి : ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావాలి: ఆర్జీవీ
అప్పుడు నన్ను నేనే బ్యాన్‌ చేసుకుంటా – నాని

మరిన్ని వార్తలు