పరారీలో హీరోయిన్‌ దీపిక మేనేజర్‌

30 Oct, 2020 15:55 IST|Sakshi

ఎన్‌సీబీ సమన్లు జారీ చేసిన నాటి నుంచి అదృశ్యం

సాక్షి, ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, శ్రద్ధ కపూర్‌, దీపికా పదుకొనేలను నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపిక టాలెంట్‌ మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌కి ఎన్‌సీబీ అధికారులు మంగళవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. బాలీవుడ్ డ్రగ్స్ దర్యాప్తు కేసులో అరెస్టయిన డ్రగ్ పెడ్లర్‌ను విచారించినప్పుడు కరిష్మా ప్రకాష్ పేరు వెలుగులోకి వచ్చిందని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. వెర్సోవాలోని కరిష్మా నివాసంలో మంగళవారం ఎన్‌సీబీ అధికారుల దర్యాప్తులో 1.7 గ్రాముల హషీష్, సీబీడీ ఆయిల్ మూడు బాటిళ్లనిస్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెకు సమన్లు జారీ చేశారు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. (చదవండి: ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి)

కరిష్మా ప్రకాష్‌కు డ్రగ్ పెడ్లర్‌తో సంబంధాలుండటం, ఆమె నివాసం నుంచి డ్రగ్స్ రికవరీ, ఎన్‌సీబీకి సహకరించకపోవడం, సమన్లు జారీ చేశాక విచారణకు హాజరుకాకపోవడం వంటి పనులు ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టవచ్చని.. ఎన్‌సీబీ ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ కేసు విచారణలో ఎన్‌సీబీ అధికారులు కరిష్మా ప్రకాష్, దీపికా పదుకొనే మధ్య జరిగిన అనుమానాస్పద మెసేజ్‌లను గుర్తించారు. దీని ఆధారంగా ఈ ఇద్దరినీ గత నెలలో ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నించారు. కరిష్మా ప్రకాష్ మాత్రమే కాక, ఆమె సహోద్యోగి జయ సాహా, నటులు రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌లను కూడా గత నెలలో ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నించారు. కానీ ఎలాంటి ఫలితం లేదని సమాచారం. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..)

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేసింది. అతని స్నేహితురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. ఒక నెల జైలు శిక్ష తరువాత ఆమె బెయిల్ పొందిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు