మా డాడీ జీవితం ఎందరికో ఆదర్శం.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: దీపికా పదుకోన్‌

19 Feb, 2022 07:38 IST|Sakshi

‘‘మా నాన్న (ప్రకాశ్‌ పదుకోన్‌) జీవితం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అందుకే ఆయన బయోపిక్‌ తీయాలనుకుంటున్నాను’’ అన్నారు దీపికా పదుకోన్‌. దీపిక తండ్రి ప్రకాశ్‌ పేరున్న బ్యాడ్మింటన్‌ ప్లేయరన్న సంగతి తెలిసిందే. 1980లో వరల్డ్‌ నంబర్‌ 1 బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా నిలవడంతో పాటు ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ను గెలిచి, రికార్డు సృష్టించారు ప్రకాశ్‌. జీవితంలో ఇంత సాధించిన తన తండ్రి బయోపిక్‌ను నిర్మించే పనులు మొదలుపెట్టినట్లు దీపిక పేర్కొన్నారు.

ఈ విషయం గురించి దీపికా పదుకోన్‌ మాట్లాడుతూ – ‘‘భారత క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ గెలవకముందే (1983లో క్రికెట్‌ జట్టు విశ్వవిజేతగా నిలిచింది) మా నాన్నగారు అథ్లెట్‌గా దేశ క్రీడా ఖ్యాతిని విశ్వవేదికపైకి తీసుకుని వెళ్లారు. అథ్లెట్‌గా నాన్న సాధన చేయడానికి అప్పట్లో మెరుగైన సౌకర్యాలు కూడా లేవు. పెళ్లి మండపాల్లో సాధన చేసేవారు. తన బలహీనతలను బలాలుగా మార్చుకునేందుకు నిరంతరం కృషి చేసేవారు. ఆయన జీవితం ఓ స్ఫూర్తి’’ అన్నారు.

మరిన్ని వార్తలు