రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు, మనసారా ఏడ్చి బ్రేకప్‌ చెప్పా : దీపిక

11 Jul, 2021 08:38 IST|Sakshi

అగర్‌ తుమ్‌ సాథ్‌ హో ..  తేరీ నజ్‌రోమే హై తేరే సప్నే 
తేరే సప్నోమే మే హై నారాజీ 
ముఝే లగ్తా హై కె బాతే దిల్‌ కీ .. హోతీ లఫ్జోంకీ ధోఖేబాజీ
తుమ్‌ సాథ్‌ హో యా నా హో క్యా ఫర్క్‌ హై.. బేదర్ద్‌ థీ జిందగీ బేదర్ద్‌ హై..
( నీ కళ్ల నిండా నీ కలలే.. ఆ కలల్లో ఉన్నదంతా బాధే.. 
మనసులోని ఊసులన్నీ పెదాల మీది గారడీగా అనిపిస్తున్నాయి నాకు..
నువ్వు నా తోడున్నా లేకపోయినా తేడా ఏం ఉంది? అప్పుడూ నిర్దయగానే ఉండింది.. ఇప్పుడూ నిర్దయగానే సాగుతోంది జీవితం)

ఈ పాట ‘తమాషా’ సినిమాలోనిది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్, దీపికా పడుకోణ్‌  హీరోహీరోయిన్లు. ఆ బ్రేకప్‌ సాంగ్‌ ఒకరకంగా ఆ ఇద్దరి భగ్నప్రేమకూ తెరరూపంగా కనిపించింది. నిజానికి వాళ్లిద్దరూ నటీనటులుగా కంటే కూడా లవ్‌బర్డ్స్‌గానే ప్రాచుర్యం పొందారు. 

దీపిక.. ప్రేమ పిపాసి. రణ్‌బీర్‌.. కాసనోవా. అతని చూపులు, మాటలు, చేష్టలకు ఏ అమ్మాౖయెనా పడిపోవాల్సిందే. దీపికా పడిపోయింది. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ లేని ఆమెకు రణ్‌బీర్‌.. అతని చుట్టూ ఉన్న వాతావరణం.. ఆ కుటుంబం అద్భుతంగా కనిపించింది. జీవితం కూడా సినిమాలాగే తోచింది. ఇలలో అతని కథానాయిక తానే అనుకుంది.. నమ్మింది!

లంచ్‌తో మొదలై హాలిడే వరకు
దీపిక, రణ్‌బీర్‌ల మేకప్‌ ఆర్టిస్ట్‌ బృందం ఒకటే. అందులోని ఒక ఆర్టిస్ట్‌ వల్లే ఆ ఇద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అలా 2008లో వాళ్లకు స్నేహం కుదిరింది. ముందు లంచ్‌కి కలుద్దామనుకున్నారు. లంచ్‌ నుంచి సాయంకాలం కాఫీ వరకూ సాగింది ఆ సమావేశం. కాఫీ తాగేసి ఎవరిదారిన వాళ్లు వెళ్లి పోదామానుకున్నారు. కాఫీ తర్వాత చీజ్‌ కేక్‌ .. చీజ్‌ కేక్‌ నుంచి మిస్టర్‌ బీన్స్‌ ‘హాలిడే’ సినిమా దాకా వెళ్లింది వాళ్ల డే షెడ్యూల్‌. అక్కడితో దీపికకు ‘బై’ చెప్పాలనిపించలేదు రణ్‌బీర్‌కు. ఆమె కళ్లల్లోని అమాయకత్వంలో అతని మనసు చిక్కుకుపోయింది. దీపికను ఇంటి దగ్గర దిగబెట్టే వరకు అమెతో గడిపే టైమ్‌ను పొడిగించుకున్నాడు. ఇల్లొచ్చేసినా వదిలి వెళ్లాలనిపించలేదు అతనికి. ఆమెతోపాటే ఇంట్లోకి నడిచాడు. తెల్లవార్లూ కబుర్లతో ఆమె కళ్లల్లో ఇల్లు కట్టేసుకున్నాడు.

రణ్‌బీర్‌ అంటే  దీపికకు ఇష్టం మొదలైపోయింది.  ‘బచ్‌నా ఏ హసీనో’  వాళ్లిద్దరూ కలిసిన నటించి తొలి సినిమా. ఆ సెట్స్‌ మీద వాళ్ల ప్రేమ ఖరారైంది. దీపికకు ఆశల రుచి చూపించాడు. తన గురించి కలలు కనే హక్కునిచ్చాడు. ఈ దృశ్యాలన్నీ ఆ సినిమా ప్రమోషన్‌ వేదికల మీద ప్రేక్షకులకు కనిపించాయి. అలరించాయి. అందుకే ‘బచ్‌నా ఏ హసీనో’ కన్నా దీపికా, రణ్‌బీర్‌ల రియల్‌ లవ్‌నే ఎక్కువగా ఫీలయ్యారు అభిమానులు. ఆ ఇద్దరి పెళ్లి వార్త మీద ఆసక్తి పెంచుకున్నారు. అయితే బాలీవుడ్‌ వర్గాల్లో మాత్రం ఆ ఆత్రం కనపడలేదు. ఎందుకంటే రణ్‌బీర్‌ గురించి వారికి బాగా తెలుసు. ఆ ప్రేమలో అతనికి సీరియస్‌నెస్‌ లేదని, ఆ ప్లేబాయ్‌ కత్రీనాతో చేతిలో చేయి వేసి నడుస్తున్నాడనీ తెలుసు. 

పచ్చబొట్టూ వేసుకుంది
రణ్‌బీర్‌ కేంద్రంగానే ప్రపంచాన్ని అల్లుకుంది దీపిక. అతని బలాన్ని చూసి మురిసిపోయింది. బలహీనతలను ఎంచకుండా ఉండిపోయింది. ఆ ప్రేమను తన మెడ మీద ‘ఆర్‌కే (రణ్‌బీర్‌ కపూర్‌)’ గా పచ్చబొట్టుతో చెక్కుకుంది. నిజానికి ఈ ప్రేమ్‌ కహానీని ఆద్యంతం గమనిస్తే ఇందులో రణ్‌బీర్‌ సైలెంట్‌ లవర్‌గానే ఉన్నాడు.  భావోద్వేగాలతో మీడియా ముందు బయటపడింది దీపికానే.. ‘రణ్‌బీరే నా లోకం. తన దగ్గర నేను నేనుగా ఉండగలను. మా రిలేషన్‌పిప్‌లోని బ్యూటీ అదే!’ అంటూ. ఈ ధోరణేదీ రణ్‌బీర్‌ తల్లిదండ్రులకు నచ్చలేదు. ఆమెను ఆ ఇంటి కోడలిగా ఒప్పుకునేది లేదనీ రణ్‌బీర్‌కు స్పష్టం చేశారు. అప్పుడూ మౌనంగానే ఉన్నాడతను అర్థాంగీకారంగా.

తెలిసిపోయింది..
నిజం ఎన్నాళ్లో దాగదు. కానీ ముందు బయటవాళ్లకు తెలిశాకే ఐన వాళ్లను చేరుతుంది. కత్రినాతో రణ్‌బీర్‌ చనువూ అలాగే ఆలస్యంగా  తెలిసింది దీపికాకు. కాళ్లబేరానికి వచ్చాడు రణ్‌బీర్‌ ‘నేనలాంటి వాణ్ణి కాను.. ఇంకొక్క చాన్స్‌ ఇవ్వమంటూ.  క్షమించేసింది. ఆ చాన్స్‌నూ నిలుపుకోలేకపోయాడు. రెడ్‌హ్యాండెడ్‌గా దీపికాకు దొరికిపోయాడు. ఇంక అతనితో కుదరదు.. ఆ ప్రేమ నిలవదు అనుకొని ఆ బంధాన్ని బ్రేక్‌ చేసుకుంది. మనసారా ఏడ్చింది.. రణ్‌బీర్‌ అనే బలహీనతను అధిగమించి అతణ్ణి ఓ సహనటుడిగా మాత్రమే అంగీకరించేంతగా!  కొత్త ప్రారంభానికి అడుగేసింది. 

‘అతను మోసం చేస్తున్నాడని ఫస్ట్‌టైమ్‌ తెలిసినప్పుడు తప్పు నాదేనేమో అనుకున్నా. ఆ మోసం కంటిన్యూ అవుతోందని గ్రహించాక తప్పు అవతలి వ్యక్తిలోనే ఉందని అర్థమైంది. నన్నో ఫూల్‌ని చేసి ఆడిస్తున్నాడని తెలిశాక ఆ రిలేషన్‌లో ఉండడం మీనింగ్‌లెస్‌. అసలు నేను అతనికి సెకండ్‌ చాన్స్‌ ఇచ్చి ఉండాల్సిందే కాదు. కాళ్లావేళ్లా పడితే ఇచ్చాను. అదీ ఒకందుకు మంచిదే అయింది. నా కళ్లముందే పట్టుపడి నా కళ్లు తెరిపించాడు. ఏమీ ఆశించకుండా అతణ్ణి ప్రేమించా. నమ్మకం, గౌరవం పునాదుల మీదే ప్రేమ నిలబడుతుంది. ఆ రెండిటి విలువ అవతలి మనిషికి తెలియనప్పుడు ఆ బంధంలోంచి బయటకు రావడమే మంచిది. బ్రేకప్‌ తర్వాత ఒక కొత్త మనిషిగా మారాను. నన్నిలా మార్చిన ఘనత అతనిదే. థాంక్స్‌ టు హిమ్‌’  అని చెప్పింది దీపిక పడుకోణ్‌.. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. 
∙ఎస్సార్‌

మరిన్ని వార్తలు