నిర్భయపై వెబ్‌ సిరీస్‌కు అంతర్జాతీయ అవార్డ్‌

26 Nov, 2020 00:10 IST|Sakshi

మహేశ్‌బాబు సహా స్టార్ల ప్రశంసల జల్లు

‘ఢిల్లీ క్రైమ్‌’... ఇప్పుడు మీడియా అంతా పలవరిస్తున్న వెబ్‌ సిరీస్‌. సాక్షాత్తూ హీరో మహేశ్‌బాబు సహా పలువురు సినీ తారలు అభినందిస్తున్న వెబ్‌ సిరీస్‌. కారణం... తాజాగా 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల్లో బెస్ట్‌ డ్రామా సిరీస్‌గా ‘ఢిల్లీ క్రైమ్‌’కు దక్కిన అపూర్వ గౌరవం.

ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా’ నిర్మించిన ఒరిజినల్‌ సిరీస్‌ ఇది. ఈ క్రైమ్‌ డ్రామా యాంథాలజీకి భారతీయ – కెనడియన్‌ అయిన రిచీ మెహతా రచన, దర్శకత్వ బాధ్యతలు వహించారు. సరిగ్గా ఏణ్ణర్ధం క్రితం గత ఏడాది మార్చి ద్వితీయార్ధంలో నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాలో ఈ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్‌ సీజన్‌ విడుదలైంది. ఏడు ఎపిసోడ్ల తొలి సీజన్‌ రిలీజ్‌ సమయంలోనే పలువురి దృష్టిని ఆకర్షించింది. తాజాగా దక్కిన అవార్డుతో మరోసారి మళ్ళీ అందరూ ‘ఢిల్లీ క్రైమ్‌’ గురించి మాట్లాడుకుంటున్నారు.

అమెరికా బయట నిర్మాణమై, ప్రసారమైన ఉత్తమ టీవీ కార్యక్రమాలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ ఈ ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డులను ప్రకటిస్తుంది. 1973లో మొదలైన ఈ అవార్డుల ప్రదానోత్సవం ఏటా నవంబర్‌లో అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జరుగుతుంది. కరోనా దెబ్బతో ఈసారి ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆన్‌ లైన్‌లో వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించారు.

‘ఢిల్లీ క్రైమ్‌’ కథ ప్రాథమికంగా దేశరాజధాని ఢిల్లీ నగరంలో ఎనిమిదేళ్ళ క్రితం 2012 డిసెంబర్‌లో ఓ రాత్రి వేళ నడుస్తున్న బస్సులో ఓ అమ్మాయిపై జరిగిన సామూహిక అత్యాచార సంఘటన ఆధారంగా తీసిన వెబ్‌ సిరీస్‌. ప్రపంచవ్యాప్తంగా సంచలనమై, ‘నిర్భయ’ ఉదంతం పేరుతో ఆ సంఘటన కొన్ని నెలల పాటు పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. అప్పట్లో ఢిల్లీ పోలీస్‌ శాఖలో డి.సి.పి. అయిన ఛాయా శర్మ అనే అధికారిణి మూడు రోజుల్లోనే ఆ దారుణమైన గ్యాంగ్‌ రేప్‌ కేసును ఛేదించారు.

ఆ నిజజీవిత సంఘటనలనూ, పాత్రలనూ తీసుకొని, ‘ఢిల్లీ క్రైమ్‌’ వెబ్‌ సిరీస్‌ను అల్లుకున్నారు. సినిమాలో వార్తికా చతుర్వేది అనే పేరుతో ఆ మహిళా పోలీసు అధికారిణి పాత్రను చూపించారు. నటి షెఫాలీ షా తెరపై ఆ పాత్రకు జీవం పోశారు. బాధాకరమైన నిర్భయ ఉదంతాన్ని సున్నితంగా తెరపై చూపడంతో ‘ఢిల్లీ క్రైమ్‌’ ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్‌లో నటించిన రసికా దుగాల్, అదిల్‌ హుస్సేన్, రాజేశ్‌ తైలాంగ్‌ల నటనను అందరూ అభినందించారు.

సరిగ్గా మహిళలపై హింసా నిర్మూలన కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ దినోత్సవానికి (నవంబర్‌ 25) ముందు ఢిల్లీ క్రైమ్‌కు అవార్డు దక్కడంతో రిచీ మెహతా కూడా ఉద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మగవాళ్ళు తమపై జరుపుతున్న హింసను సహించడమే కాక, చివరకు ఆ సమస్యను పరిష్కరించే బృహత్‌ కార్యాన్ని కూడా భుజానికెత్తుకున్న మహిళలందరికీ ఈ తాజా ఎమ్మీ అవార్డు అంకితం’’ అని అవార్డు అందుకుంటూ రిచీ  వ్యాఖ్యానించారు. హృతిక్‌ రోషన్, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, సోనాలీ బేంద్రే, అదితీ రావు హైదరీ, దియా మిర్జా, కరణ్‌ జోహార్‌ సహా పలువురు ప్రముఖులు తాజా అవార్డుతో ‘ఢిల్లీ క్రైమ్‌’ టీమ్‌ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘‘నిర్భయ ఉదంతం జరిగినప్పుడు అందరం ఆగ్రహానికీ, ఆవేశానికీ గురయ్యాం. ఆ భావోద్వేగమే తరువాత ఈ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నప్పుడు తెరపై కనిపించింది. అదే ఇప్పుడు అందరి అభినందనలకూ, అవార్డుకూ కారణమైంది. అందుకే, మిగిలిన ప్రాజెక్టుల కన్నా మాకు ఇది ఎంతో స్పెషల్‌’’ అని ‘ఢిల్లీ క్రైమ్‌’లో మరో కీలక పాత్రధారి అయిన రాజేశ్‌ తైలాంగ్‌ అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడీ ఎమ్మీ అవార్డు కేవలం ఒక ఓటీటీకో, ఒక వెబ్‌ సిరీస్‌కో దక్కిన గౌరవం అనలేం. ఇండీ కంటెంట్‌ అందించే ప్రతి ఒక్కరికీ గర్వకారణం. పైపెచ్చు, సినిమాలకు సంబంధించి ఆస్కార్‌ అవార్డు ఎలాంటిదో, టీవీ సిరీస్‌లకు ఎమ్మీ అవార్డు అలాంటిది. అందుకే, ఇప్పుడు ‘ఢిల్లీ క్రైమ్‌’కు దక్కిన పురస్కారం అందరికీ ఆనందం కలిగిస్తోంది.

>
మరిన్ని వార్తలు