రకుల్‌ పిటిషన్‌పై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

29 Sep, 2020 16:48 IST|Sakshi

న్యూఢిల్లీ : రియా చక్రవర్తి డ్రగ్స్‌ కేసుకు సంబంధించి తన పేరును మీడియా కథనాలలో చర్చించకుండా చర్యలు తీసుకోవాలని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. డ్రగ్‌ కేసులో తన పేరు మీద వార్తలు రాయడం వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని, ఇలాంటి కథనాలు ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలో రకుల్‌ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ చేపట్టగా రకుల్‌ తరపున న్యాయవాది అమన్ హింగోరాని తమ వాదనలు వినిపించారు.

నటి దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్‌ 17న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి చర్చలను తీసుకున్నారో సూచిస్తూ స్టేటస్‌ రిపోర్టులు దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. అలాగే మీడియాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ అసోసియేషన్‌లను జస్టిస్‌ నవీన్‌ చావ్లా ఆదేశాలు జారీ చేశారు.

అయితే రకుల్‌ తన పిటిషన్‌లో డ్రగ్‌  కేసులో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో విచారణ పూర్తి చేసి, తగిన నివేదికను కోర్టు ముందు దాఖలు చేసే వరకు మీడియా తనపై వార్తలు ప్రసారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. అయితే దీనిపై తక్షణమే ఆదేశాలు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను కోర్టు ఆక్టోబర్‌ 15కు వాయిదా వేసింది. కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో భాగంగా  రియా చక్రవర్తిని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్‌ కోణం బయట పడిన విషయం తెలిసిందే. రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ ఆమె స్టేట్‌మెంట్ల ఆధారంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, దీపికా పదుకొనె, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌లను కూడా విచారించింది

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా