5జీ టెక్నాలజీ: జూహీచావ్లాకు షాక్‌.. 20లక్షల జరిమానా

4 Jun, 2021 17:03 IST|Sakshi

న్యూఢిల్లీ : 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ సీనియర్​ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.  శుక్రవారం పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు 5జీ టెక్నాలజీ వద్దన్న ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ కావాల్సిందేనని స్పష్టీకరించింది. అయితే, కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జూహీ అభిమాని సినిమా పాటలు వినిపించటం.. ప్రొసీడింగ్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు కోర్టు ఆమెపై సీరియస్‌ అయింది. రూ.20లక్షల పెనాల్టీ వేసింది. కోర్టును ఆశ్రయించేకంటే ముందు ప్రభుత్వానికి ఈ విషయమై లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. పిటిషన్లో బలం లేదని, అనవసరంగా దాఖలు చేశారని పేర్కొంది.

కాగా, 5జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని, పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధ్రువీకరించేవరకూ 5జీని ఆపాలని కోరుతూ జూహీచావ్లాతో సహా మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ  హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 5 వేల పేజీల ఈ పిటిషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి ఏజెన్సీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్​​ కోసమే అని, ఆమె పిటిషన్​ను కొట్టేయాలని కేంద్రం ఢిల్లీ హైకోర్టును కోరింది.

చదవండి : నటి వీరాభిమాని బిత్తిరిచర్య.. జడ్జి ఆగ్రహం

మరిన్ని వార్తలు