'వాల్తేరు వీరయ్య'తో నా కల నెరవేరింది : దేవీ శ్రీ ప్రసాద్‌

13 Jan, 2023 08:16 IST|Sakshi

‘‘వాల్తేరు వీరయ్య’లో ‘పూనకాలు లోడింగ్‌..’ పాటలో బూరలాంటి వాయిద్యం ఉపయోగించి ఆ ట్యూన్‌ని కంపోజ్‌ చేశాను. అది చిరంజీవిగారికి నచ్చడంతో ‘అదరగొట్టావ్‌ అబ్బాయ్‌’ అన్నారు. నేను కంపోజ్‌ చేసిన ట్యూన్‌ ఒక ఎత్తు అయితే ఆయన డ్యాన్స్‌తో పాటని మరో స్థాయికి తీసుకెళ్లారు’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ అన్నారు. చిరంజీవి, శ్రుతీహాసన్‌ జంటగా హీరో రవితేజ కీలక పాత్రలో బాబీ కొల్లి (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్‌ చెప్పిన విశేషాలు.

∙చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణగారి ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు నిర్మించింది మా మైత్రీ మూవీస్‌ నిర్మాతలే (నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌). రెండు సినిమాలూ మావే కావడం, సంక్రాంతికి విడుదలవడం చాలా గర్వంగా ఉంది. సంగీతం విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదు. ఏ సినిమాకైనా కథ ప్రకారమే మ్యూజిక్‌ చేస్తాం.. రెండు సినిమాలూ అద్భుతంగా ఆడాలి. బాబీతో నాకు చాలా అనుబంధం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’లో అన్ని పాటలూ హిట్‌ కావడానికి కారణం బాబీ కథ, ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం. అన్నిటికీ మించి చిరంజీవిగారు మా ఇద్దరిపై పెట్టుకున్న నమ్మకం.

చిరంజీవిగారితో సినిమా చేయాలనే బాబీ కల ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి చిరంజీవిగారితో ‘నవ్విస్తూ ఏడిపించారు.. ఏడిపిస్తూ నవ్వించారు’ అని అన్నాను. ఆయన ‘ఎంత బాగా చెప్పావ్‌ మై బాయ్‌’ అన్నారు. ∙ఈ సినిమాలో రవితేజ, చిరంజీవిగారి సీన్స్‌కి క్లాప్స్‌ మామూలుగా ఉండవు. కంటతడితో, నవ్వుతూ క్లాప్స్‌ కొట్టే సీన్స్‌ చాలా ఉంటాయి. బాస్‌ని (చిరంజీవి) మనం ఎలా అయితే చూస్తూ పెరిగామో.. ఆ ఎలిమెంట్స్‌తో పాటు కొన్ని కొత్త ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి.

► కామెడీ, డ్యాన్స్‌ ఫైట్స్‌.. అన్నీ కుమ్మేశారు. బాస్‌ని చాలా రోజుల తర్వాత పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌లో చూస్తున్నాం.. ఎక్కడా తగ్గకూడదని ప్రతి పాట విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా. ప్రతి సినిమా సవాల్‌గానే ఉంటుంది. కానీ, ఒత్తిడిగా భావించకుండా సరదాగా చేస్తాను. నేను బాస్‌ని చూస్తూ పెరిగాను.. ఆయన్ని చూడగానే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఇందులో ‘నువ్వు శ్రీదేవి..’ పాటకి ఆయన స్క్రీన్‌పై ఎలా చేస్తారో ముందే ఊహించి, కంపోజ్‌ చేసి బాబీకి చూపించా.. అలాగే ‘పూనకాలు లోడింగ్‌..’ పాటలో చిరంజీవి, రవితేజగార్లు కనిపిస్తే ఎంత సందడిగా ఉంటుందో ఆ ఎనర్జీ అంతా పాటలో ఇచ్చేశాం. అదరగొట్టావ్‌ అబ్బాయ్‌ అన్నారు – దేవిశ్రీ ప్రసాద్‌

మరిన్ని వార్తలు