పాఠం చెబుతాం.. దారిలో పెడతాం...

12 Nov, 2022 13:38 IST|Sakshi

చదువుకోవడానికి డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌ ఉన్నట్లే క్లాస్‌లో డిఫరెంట్‌ మైండ్‌సెట్‌తో ఉన్న స్టూడెంట్స్‌ ఉంటారు. అందరికీ పాఠాలు చెప్పడంతో పాటు దారిలో పెట్టాల్సిన బాధ్యత టీచర్లదే. ఇలా స్టూడెంట్స్‌ను దారిలో పెట్టేందుకు కొందరు స్టార్స్‌  కాలేజీలకు వెళ్తున్నారు. మరి.. ఈ లెక్చరర్లు ఏ విధంగా పాఠాలు చెప్పారనేది మాత్రం సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాల్సిందే.  

విద్యార్థులకు ఇంకా మెరుగైన విద్యను అందించేందుకు ఏం చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓ మాస్టారు. ఈ మాస్టారు ఎవరో కాదు.. ధనుశ్‌. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుశ్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘సార్‌’ (తమిళంలో ‘వాతి’) అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విద్యావ్యవస్థలోని లోపాలను సరి చేయాలనుకునే మాస్టారుగా కనిపిస్తారు ధనుశ్‌. ఇందులో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఎస్‌. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక మారేడుమిల్లి ప్రజానీకాన్ని చైతన్యపరిచేందుకు మాస్టారుగా నడుం బిగించారు ‘అల్లరి’ నరేశ్‌.

ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఇందులో ఆనంది హీరోయిన్‌. రాజేష్‌ దండా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్‌ టీచర్‌గా కనిపించనున్నారు.  ఓ ఎలక్షన్‌ డ్యూటీ నిమిత్తం మారేడుమిల్లి వెళ్లి, అక్కడి ప్రజల ఇక్కట్లను పరిష్కరించి, వారు ఎన్నికల్లో పాల్గొనే విధంగా కష్టపడే టీచర్‌గా ‘అల్లరి’ నరేశ్‌ పాత్ర ఉంటుందని తెలిసింది. మరోవైపు విజయ్‌ సేతుపతి కూడా బ్లాక్‌బోర్డ్‌పై పాఠాలు చెబుతున్నారు. ఇది ‘విడుదలై’ సినిమా కోసం. వెట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతితో పాటు సూరి, గౌతమ్‌ మీనన్‌ ప్రధాన పాత్రధారులు.

ఈ సినిమాలో ప్రొఫెసర్‌ పాత్ర చేస్తున్నారు విజయ్‌ సేతుపతి. 1980 నేపథ్యంలో సాగే ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది.  ఇక ఉపాధ్యాయులందరూ బ్లాక్‌బోర్డ్‌పై పాఠాలు చెబుతుంటే ఉపాధ్యాయురాలు మాత్రం గ్రౌండ్‌లో క్లాసులు తీసుకుంటున్నారు. అమలా పాల్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న చిత్రం ‘ది టీచర్‌’. వివేక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పీఈటీ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌) పాత్రలో కనిపించనున్నారు అమలా పాల్‌. ఈ సినిమాను డిసెంబరు 2న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇక మ్యూజిక్‌ స్కూల్‌లో టీచర్స్‌గా చేరారు శ్రియ, శర్మాన్‌ జోషి.

ఈ ఇద్దరూ ప్రధాన తారలుగా పాపారావు బియ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మ్యూజిక్‌ స్కూల్‌’. విద్యా వ్యవస్థలో చదువుతో పాటు స్పోర్ట్స్, సంగీతం వంటివి కూడా ముఖ్యమని చెప్పే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో టీచర్‌ మేరి పాత్రను శ్రియ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. అలాగే హిందీలో పాఠాలు చెబుతున్నారు హీరోయిన్లు రాధికా మదన్, నిమ్రత్‌ కౌర్‌. హిందీ చిత్రం ‘హ్యాపీ టీచర్స్‌ డే’లో ఈ ఇద్దరు టీచర్లుగా నటిస్తున్నారు. మిఖిల్‌ ముసలే ఈ సినిమాకు దర్శకుడు. వచ్చే ఏడాది టీచర్స్‌ డే సందర్భంగా  ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు