The Gray Man Review In Telugu: యాక్షన్‌ ప్రియులను మెప్పించే 'ది గ్రే మ్యాన్‌'రివ్యూ..

23 Jul, 2022 16:27 IST|Sakshi

టైటిల్‌: ది గ్రే మ్యాన్
నటీనటులు: రేయాన్‌ గాస్లింగ్, క్రిస్‌ ఎవాన్స్, ధనుష్‌, అనా డి అర్మాస్‌, జూలియా బట్టర్స్‌
కథ: మార్క్‌ గ్రీన్‌ (ది గ్రే మ్యాన్‌ నవల ఆధారంగా)
సంగీతం: హెన్రీ జాక్‌మన్‌
సినిమాటోగ్రఫీ: స్టీఫెన్ ఎఫ్‌ విన్‌డన్‌
ఎడిటింగ్‌: జెఫ్‌ గ్రోత్‌, పియట్రో స్కాలియా 
దర్శకత్వం: రూసో బ్రదర్స్‌ (ఆంటోని రూసో-జో రూసో)
విడుదల తేది: జులై 22, 2022 (నెట్‌ఫ్లిక్స్‌)

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ కీలక పాత్రలో నటించిన లేటేస్ట్‌ హాలీవుడ్‌ మూవీ 'ది గ్రే మ్యాన్‌'.అవేంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌, అవేంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ వంటి పలు మార్వెల్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్‌ (ఆంటోని రూసో-జో రూసో) ఈ సినిమాను డైరెక్ట్‌ చేశారు. హాలీవుడ్‌ పాపులర్‌ డైరెక్టర్స్ దర్శకత్వం వహించడం, సౌత్‌ స్టార్‌ ధనుష్‌ ఒక కీ రోల్‌ పోషించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలైంది. మార్క్‌ గ్రీన్‌ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 22 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. అవిక్‌ సాన్‌గా ధనుష్‌ అలరించిన 'ది గ్రే మ్యాన్‌' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథ:
కోర్ట్‌ జెంట్రీ (రేయాన్‌ గాస్లింగ్‌) నేరం చేసిన జైళ్లో శిక్ష అనుభవిస్తాడు. అతన్ని అమెరికన్‌ సీఐఏ (సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ) ఏజెంట్‌ సిక్స్‌గా డొనాల్డ్‌ ఫిట్జ్‌రాయ్‌ (బిల్లీ బాబ్‌) తీసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక క్రిమినల్‌ను చంపమని ఏజెంట్‌ సిక్స్‌కు టార్గెట్‌ వస్తుంది. ఆ క్రిమినల్‌ను చంపేటప్పుడు అతను కూడా ఒక సీఐఏ ఏజేంట్‌ అని సిక్స్‌కు తెలుస్తోంది. తాను ఏజెంట్‌ ఫోర్‌ అని చెప్పి ‍అతని దగ్గర ఉన్న ఒక పెండ్రైవ్‌ను సిక్స్‌కు ఇస్తాడు. ఆ పెండ్రైవ్‌లో ఏముంది ? దాంతో ఏజెంట్ సిక్స్‌ ఏం చేశాడు? ఆ ప్రెండైవ్‌ను సాధించేందుకు అత్యంత క్రూరుడు లాయిడ్‌ హాన్సన్‌ (క్రిస్‌ ఇవాన్స్‌) ఏం చేశాడు? అతని నుంచి సిక్స్‌ ఎలా తప్పించుకున్నాడు ? ఇందులో అవిక్‌ సాన్‌ (ధనుష్‌) పాత్ర ఏంటీ? అనేది తెలియాలంటే 'ది గ్రే మ్యాన్‌' చూడాల్సిందే. 

విశ్లేషణ:
ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన అవేంజర్స్ సిరీస్‌, పలు మార్వెల్‌ సినిమాలను డైరెక్ట్‌ చేసిన రూసో బ్రదర్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అద్భుతమైన గ్రాఫిక్స్‌, వండర్‌ఫుల్‌ విజువల్స్‌తో ఆ సినిమాలను రూపొందించిన రూసో బ్రదర్స్‌ ఆ జోనర్‌ నుంచి పూర్తిగా బయటకు వచ్చి రూపొందిన చిత్రమే ఇది. అయితే ఎంతో పేరు ఉన్న దర్శకద్వయం ఒక రొటీన్‌ స్టోరీకి యాక్షన్‌ అద్దారు. ఇలాంటి తరహాలో వచ్చిన జేమ్స్ బాండ్‌ సిరీస్‌, మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌లను ఇదివరకే చూసిన ప్రేక్షకులకు ఈ మూవీ అంతగా రుచించదు. సినిమాలోని వైల్డ్‌ యాక్షన్‌ సీన్స్‌ మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. దానికి తగినట్లుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ బాగుంది. హీరో-విలన్ మధ్య వచ్చే సీన్లు అంతగా థ్రిల్లింగ్‌గా లేవు. క్లెయిర్‌ ఫిట్జ్‌రాయ్‌ (చైల్డ్‌ ఆర్టిస్ట్‌ జూలియా బట్టర్స్‌), ఏజెంట్‌ సిక్స్ మధ్య వచ్చే కామెడీ, ఎమోషనల్‌ సన్నివేశాలు బాగుంటాయి. ఇక అవిక్‌ సాన్‌, లేన్‌ వూల్ఫ్‌గా ధనుష్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ ఆకట్టుకున్నాయి. యాక్షన్‌తో కొద్దిసేపు అలరించిన ధనుష్‌ పాత్ర అంతగా ఇంపాక్ట్ చూపించినట్లు అనిపించలేదు. 


ఎవరెలా చేశారంటే?
ఏజెంట్‌ సిక్స్‌గా రేయాన్ గాస్లింగ్‌ అదరగొట్టాడు. యాక్షన్‌ సీన్స్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. అయితే క్యారెక్టర్‌లో కొత్తదనం లేకపోవడంతో అంతలా ఎఫెక్టివ్‌గా అనిపించదు. కెప్టెన్ అమెరికా రోల్‌ ఫేమ్‌ క్రిస్ ఇవాన్స్‌ సైకో విలన్‌గా బాగా నటించాడు. అక్కడక్కడా తను చూపించే అట్టిట్యూడ్‌ ఆకట్టుకుంటుంది. ఏజెంట్‌ సిక్స్‌కు హెల్ప్‌ చేసే డాని మిరండా పాత్రలో అనా డి అర్మాస్‌ నటన బాగుంది. అవిక్‌ సాన్‌, లేన్‌ వూల్ఫ్‌గా ధనుష్ యాక్టింగ్‌ బాగుంది. ధనుష్‌ ఉన్నంతసేపు వైల్డ్‌ యాక్షన్‌ ఉంటుంది. ఇక మిగతా క్యాస్టింగ్‌ కూడా పరిధి మేర బాగా నటించారు. హెన్రీ జాక్‌మెన్‌ బీజీఎం, స్టీఫెన్ ఎఫ్‌ విన్‌డన్‌ సినిమాటోగ్రఫీ, జెఫ్‌ గ్రోత్‌, పియట్రో స్కాలియా ఎడిటింగ్‌ కూడా ఓకే. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే కథ పక్కనపెట్టి యాక్షన్‌ను ఇష్టపడే వారిని ఎంటర్‌టైన్‌ చేసే 'ది గ్రే మ్యాన్'.  

-సంజు (సాక్షి వెబ్‌డెస్క్‌)

మరిన్ని వార్తలు