Captain Miller-Lyca Productions: లైకా ప్రొడక్షన్స్‌ బిగ్ డీల్.. స్టార్ హీరో మూవీ రైట్స్ సొంతం!

27 Sep, 2023 12:26 IST|Sakshi

కోలీవుడ్ హీరో ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కెప్టెన్‌ మిల్లర్. ఈ చిత్రంలో‌ నటి మాళవిక మోహన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్‌ పతాకంపై టీజీ త్యాగరాజన్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అరుణ్‌ మాదేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాతర కార్యక్రమాలను ముమ్మరంగా జరుపుకుంటోంది. 

కాగా.. ఈ చిత్రంలో ధనుష్‌ గెటప్‌ చాలా భిన్నంగా ఉండడం.. ట్రైలర్‌ ఇటీవలే విడుదలై విశేష స్పందన పొందడంతో కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా త్వరలో ఆడియో రిలీజ్‌తో పాటు మరిన్నీ విషయాలను చిత్ర నిర్మాతలు వెల్లడించనున్నట్లు సమాచారం. అదే విధంగా కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రంపై వ్యాపార వర్గాల్లో చాలా క్రేజ్‌ ఉంది. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్‌ విడుదల హక్కులను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ దక్కించుకుంది. 

లైకా ప్రొడక్షన్స్ పలు భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. మరో పక్క ఇతర చిత్రాలను సైతం విడుదల చేస్తోంది. అలా ఇటీవల అజిత్‌ హీరోగా నటించిన తుణివు(తెగింపు) చిత్రాన్ని విదేశాలలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసింది. తాజాగా ధనుష్‌ నటిస్తున్న కెప్టెన్‌ మిల్లర్‌ చిత్ర విదేశీ విడుదల హక్కులను పొందడం మరో విశేషం. ఈ విషయాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ సంస్థ మంగళవారం అధికారికంగా మీడియాకు వెల్లడించింది. 

మరిన్ని వార్తలు