Die Hard Fan Review: ‘డై హార్డ్ ఫ్యాన్’ మూవీ రివ్యూ

2 Sep, 2022 15:45 IST|Sakshi

టైటిల్‌ : డై హార్డ్ ఫ్యాన్
నటీనటులు :ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీహాన్ సినీ క్రియేషన్స్ 
నిర్మాత: చంద్రప్రియ సుబుద్ది 
దర్శకత్వం: అభిరామ్
సంగీతం : మధు పొన్నాస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి
సినిమాటోగ్రఫీ:జగదీష్ బొమ్మిశెట్టి 
ఎడిటర్‌: తిరు
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్ : తిరుమలశెట్టి వెంకటేశ్‌
విడుదల తేది: సెప్టెంబర్‌ 2, 2022

ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి జంట‌గా నటించిన  చిత్రం ‘డై హార్డ్‌ ఫ్యాన్‌’. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్‌ డైరెక్టర్‌  అభిరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షకలక శంకర్‌, రాజీవ్‌ కనకాల, నోయల్‌ కితర కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన కాన్సెప్ట్‌ మోషన్‌ పోస్టర్‌, ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు (సెప్టెంబర్‌ 2)న విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..?
శివ(శివ ఆలపాటి) అనే యువకుడికి హీరోయిన్‌ ప్రియాంక (ప్రియాంక శర్మ) అంటే ఎనలేని అభిమానం. ఒక్కసారైనా తనను ప్రత్యేక్షంగా కలవాలనుకుంటాడు. ఆమె ఏ ఫంక్షన్‌కి వెళ్లినా తను అక్కడికి వెళ్లేవాడు. ఇక తన అభిమాన హీరోయిన్‌ ప్రియాంక బర్త్‌డేని ఎంతో గ్రాండ్‌గా చేద్దామని ప్లాన్‌ వేస్తాడు శివ. అయితే అనుకోకుండా ఓ రోజు రాత్రి ఆమె పర్సనల్‌ మొబైల్‌ నుంచి శివకు మెసేజ్‌ వస్తుంది. శివ ఆ షాక్‌లో ఉండగానే.. ప్రియాంక నేరుగా అతని ఇంటికి వస్తుంది. ఆ రాత్రి పూట స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక.. తన అభిమాని ఇంటికి రావడానికి కారణం ఏంటి? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి జరిగిన సంఘటన నుంచి శివ ఎలా బయట పడ్డాడు? హత్య కేసులో ఇరుక్కున్న శివ, అతని మామయ్య శంకర్‌ని బయటకు తీసుకురావడానికి లాయర్‌ కృష్ణకాంత్‌(రాజీవ్‌ కనకాల) ఎలాంటి ప్రయత్నం చేశాడు? ఈ హత్య కేసుకు లాయర్‌ కృష్ణకాంత్‌కు ఏదైనా సంబధం ఉందా? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
సినిమా లో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్  ఉంటుందో అంద‌రికి తెలుసు. అలాంటి ఓ అభిమాని త‌ను అభిమానించే హీరొయిన్ ని క‌ల‌వాల‌నుకుంటాడు. అనుకొకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేదే ఈ సినిమా కథాంశం. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు అభిరామ్. సాధారణ కథే అయినా.. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో కొన్ని సాగదీత సీన్స్‌ పంటికింద రాయిలా అయిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ల్యాగ్ సీన్స్‌ ఎక్కువయ్యాయి. ఈ సినిమా కథంతా హీరోయిన్‌ పాత్ర చుట్టే తిరుగుతంది. కథని మరింత పకడ్బందీగా రాసుకొని, పేరున్న నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే.. 
హీరోయిన్‌ ప్రియాంకగా ప్రియాంక శర్మ తనదైన నటనతో ఆకట్టుకుంది. డై హార్డ్‌ ఫ్యాన్‌గా శివగా శివ ఆలపాటి ఆకట్టుకున్నాడు. షకలక శంకర్‌ కామెడీ నవ్వులు పూయిస్తుంది. కాబోయే రాజకీయ నాయకుడు బేబమ్మ పాత్రలో శంకర్‌ ఒదిగిపోయాడు. లాయర్‌ కృష్ణకాంత్‌గా రాజీవ్‌ కనకాల మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. ఆదిత్య పాత్రలో నోయల్‌ చాలా చక్కగా నటించారు.  కేశవ్ దీపక్, రవి వర్మ,ఆలపాటి లక్ష్మి, అప్పారావు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.  ఇక సాంకేతిక విషయానికి వస్తే..ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని  చెప్పొచ్చు.  మధు పొన్నాస్ కంపోజ్‌ చేసిన పరుగే పరుగు పాట బాగుంది. జగదీష్‌ బొమ్మిశెట్టి సినిమాటోగ్రఫీ, ఎడిటర్‌ తిరు  పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు