Neha Bamb: దిల్‌ సినిమా హీరోయిన్‌ గుర్తుందా?

13 Jul, 2021 16:11 IST|Sakshi

నేహా బాంబ్‌.. ఈ పేరు వినగానే పెద్దగా తెలిసిన వ్యక్తి కాదులే అంటారేమో కానీ 'దిల్‌' హీరోయిన్‌ అంటే మాత్రం ఇట్టే గుర్తు పడతారు. ఈ సినిమాలో నితిన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన నందినిగా అద్భుతంగా నటించి అప్పట్లో అందరి దిల్‌ దోచుకుంది నేహా. అప్పుడే విరబూసిన పారిజాతంలా ఎంతో కోమలంగా కనిపించే ఈ హీరోయిన్‌ ఇప్పుడెక్కడుంది? ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసుకుందాం.

టాలీవుడ్‌కు రావడానికి ముందు నేహా బాంబ్‌ హిందీలో 'ఇష్క్ హోగయా మేను' సినిమాలో నటించింది. తర్వాత తెలుగు పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఈ ముద్దుగుమ్మ వివి వినాయక్‌ తెరకెక్కించిన 'దిల్‌' సినిమాకు సైన్‌ చేసింది. ఈ చిత్రంలో నందిని పాత్రతో యూత్‌ను తెగ అట్రాక్ట్‌ చేసిన నేహా తర్వాత కూడా వరుస హిట్లు కొడుతుందనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె ఎంపిక చేసుకున్న సినిమాలేవీ బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా ఆడలేదు. అతడే ఒక సైన్యం, దోస్త్‌ చిత్రాలు ఆమె కెరీర్‌కు ప్లస్‌ కాలేకపోయాయి.

దీంతో హీరోయిన్‌గా అవకాశాలు రాకపోవడంతో సైడ్‌ క్యారెక్టర్‌ పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడిపోయిందీ నటి. అలా బొమ్మరిల్లు, దుబాయ్‌ శీను సినిమాల్లో మెయిన్‌ రోల్‌ కాకుండా చిన్న పాత్రల్లో కనిపించింది. ఇక్కడ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలోనే బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది నేహా బాంబ్‌. కానీ అక్కడ కూడా ఆమెకు మొండిచేయే ఎదురైంది. అయితే గుడ్డిలో మెల్ల నయం అన్నట్లుగా సినిమా ఛాన్సులు రాలేదు కానీ సీరియళ్లలో అవకాశాలు వచ్చాయి.

ప్రేక్షకులను అలరించడానికి ఏ ప్లాట్‌ఫామ్‌ అయితే ఏముంది అనుకుందో ఏమో కానీ కైసే యే ప్యార్‌ హై సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది నేహా. సీరియళ్లు చేస్తున్న సమయంలో హోస్ట్‌గానూ ఆఫర్‌ వచ్చింది. చివరగా 2009లో 'నాగిన్‌ వాడన్‌ కీ అగ్నీ పరీక్ష' సీరియల్‌లో మెరిసిన తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ సీరియల్‌ తర్వాత ఆమె నటనకు పూర్తిగా గుడ్‌బై చెప్పేసింది. రిషిరాజ్‌ జవేరీని పెళ్లి చేసుకున్న నేహా ప్రస్తుతం గృహిణిగా జీవనం సాగిస్తోంది. అయితే ఆమె తిరిగి సినిమాల్లోకి వస్తే బాగుండు అనుకుంటున్నారు నేహా బాంబ్‌ అభిమానులు. మరి వారి కోరిక కలగానే మిగిలపోతుందో, నెరవేరుతుందో చూడాలి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు