Dil Raju: నిడివి తగ్గించమంటే ఒక్క ఫ్రేమ్‌ కూడా కట్‌ చేయనన్నాడు, నీ ధైర్యం ఏంటి?

21 Nov, 2022 16:29 IST|Sakshi

‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.

నవంబర్ 18న విడుదలైన ఈ హారర్ డ్రామా ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది. రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని ఎస్‌విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్‌ రాజు యాంకర్‌గా మారి చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్‌ను కొన్ని ఆసక్తకరమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వారిద్దరి మధ్య జరిగిన  ఆసక్తికరమైన సంభాషణ మీకోసం...

దిల్ రాజు: 50 సినిమాలు తీసిన నిర్మాతగా అడుగుతున్నా... నాకు 2గం. ల 45 నిమిషాల సినిమా చూపించావు. నిడివి తగ్గించమని అడిగితే.. కుదరదని అన్నావు.. అసలు నీ ధైర్యం ఏంటి? నేను అయితే.. ఇంకో 15 నిమిషాలు ఎడిట్ చేయించేవాడిని.

రాహుల్ యాదవ్: ఏం లేదు సార్.. సినిమా విషయంలో హానెస్ట్‌గా ఉండాలనుకున్నా. కమర్షియల్‌గా చేయడానికి స్క్రిఫ్ట్ పరంగా నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ స్క్రిప్ట్ ఒప్పుకుందే.. హర్రర్ అంశాలతో పాటు ఎవరికైనా సహాయం చేయడానికి రీజన్‌ అవసరం లేదన్న మెసేజ్ కూడా కారణం.

దిల్ రాజు: ఇంత డబ్బు పెట్టావు.. ఓటీటీ, శాటిలైట్ అమ్మావా? అంటే అమ్మలేదు సార్ అన్నావ్. రిలీజ్ అంటున్నావ్.. ముందు నాన్ థియేట్రికల్ అమ్మి డబ్బు సేవ్ చేయమంటే.. పరవాలేదు సార్ అన్నావ్. అసలు ఏంటిది? అంత డబ్బు పెట్టావ్.. నీ కాన్ఫిడెన్స్ ఏంటి?

రాహుల్: నిజంగా చెప్పాలంటే.. కొన్ని ఆఫర్స్ వచ్చాయి సార్. హీరో లేడు.. హర్రర్ సినిమా.. ఇలా రకరకాల కామెంట్స్‌తో వాళ్లు నాకు కొన్ని నంబర్స్ (డబ్బు) చెప్పారు. కానీ ఆ నెంబర్స్ నేను తీసుకున్నా... తీసుకోక పోయినా పర్లేదు అనుకున్నా. అందుకే అమ్మలేదు.

దిల్ రాజు: చాలా మంది సినిమాలు తీస్తుంటారు. కానీ కొంతమందికే సక్సెస్ అవకాశం ఉంటుంది. అందులో నువ్వు కూడా ఒకడివి. అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా.. మంచి సినిమాకి సపోర్ట్ చేస్తున్నా. నీ సినిమా టేస్ట్‌కి సపోర్ట్ చేస్తున్నా. చాలా మంది అనుకుంటారు.. నేను ఏదో మనీ కోసం చేస్తున్నా అని. కానే కాదు. కానీ ఒక మంచి సినిమా తీసినప్పుడు.. సపోర్ట్ చేస్తే.. కొంతమందికైనా సినిమా రీచ్ అవుతుందనేది నా నమ్మకం. 

రాహుల్: థ్యాంక్యూ సార్

దిల్ రాజు: సౌండ్ డిజైనింగ్ దగ్గర నుంచి, డైరెక్టర్ విజన్ వరకు అంతా రాహులే చూసుకున్నాడు. నేను డైరెక్టర్‌తో కూడా మాట్లాడలేదు. రాహుల్‌తోనే లెంగ్త్ గురించి మాట్లాడా. కానీ ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేసేది లేదు సార్ అంటాడు. అప్పుడనిపించింది.. అతను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని! అని చెప్పుకొచ్చాడు.

అనంతరం నటి సంగీత మాట్లాడుతూ.. ‘‘మామూలుగా నాకు హర్రర్ సినిమాలంటే చాలా భయం. పెద్దగా చూడను. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. మేకప్ లేకుండా చేయాలంటే ఏ ఆర్టిస్ట్‌కి అయినా భయమే. కానీ నేనే థ్రిల్ అయ్యేలా చేశారు కెమెరా మ్యాన్’’ అన్నారు 

దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. '‘వెళ్లిపోమాకే’ దగ్గర నుంచి దిల్ రాజుగారిని ఫాలో అవుతున్నా. ఒక మంచి ప్రయత్నాన్ని ఆయన ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్యూ దిల్ రాజుగారు. ఒక సంవత్సరం క్రితం రాహుల్ ఆఫీస్‌కి వెళితే.. ఇప్పుడే వస్తానని చెప్పి రాహుల్ బయటికి వెళ్లి రెండు గంటల వరకు రాలేదు. అక్కడెవరూ లేకపోవడంతో.. నేనంతా పరీక్షగా చూస్తూ ఉన్నా. ఒక కార్నర్‌లో పిచ్చిపిచ్చి బొమ్మలు గీసి ఉన్నాయి. పిచ్చి పిచ్చి అని కాదు. చాలా క్రీపీ స్టఫ్ ఉంది.ఆ రోజు నేను చూసిన బొమ్మలు.. వాటి నుంచి వచ్చిన చిత్రాన్ని నేను తెరపై చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది’’ అని కోరారు. 

నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘10 ఏళ్ల క్రితం కాంజురింగ్ సినిమా చూశా.. ఆ తరువాత మళ్లీ ఈ సినిమాలో భయపడ్డా. సాయికిరణ్ ఈ సినిమాను చాలా అందంగా రాశాడు. హారర్ సినిమా కూడా ఎందుకింత అందంగా ఉందీ అంటే.. అది మీరు చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాకు, నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ.. సినిమా చూశాక అందరినీ అభినందించాలని అనిపించింది. తిరువీర్ అంటే నాకు ఈర్ష్య. చాలా మంచి నటుడు. 10 ఏళ్ల క్రితం నేను, తిరువీర్ ప్రయాణం మొదలెట్టాం. ఇలాంటి సినిమాలకు సపోర్ట్ వస్తే.. అలాంటి నటీనటులు బయటికి వస్తారు. ఈ సినిమా సీక్వెల్‌లో నేనే హీరో (నవ్వుతూ)..’’ అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో తీరువీర్, కావ్య కల్యాణ్ రామ్, బాందవీ శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి,  సినిమాటోగ్రాఫర్ నగేశ్, నటుడు కృష్ణతేజ, మసూద పాత్ర పోషించిన అఖిల రామ్ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: హౌస్‌మేట్స్‌ పొట్ట కొడుతున్న సింగర్‌ రేవంత్‌
కృష్ణానదిలో కృష్ణ అస్థికల నిమజ్జనం

మరిన్ని వార్తలు