హీరోగా అరంగేట్రం..అప్పటిదాకా టెన్షనే అన్న దిల్‌రాజ్‌

24 Aug, 2021 08:02 IST|Sakshi

‘‘హీరోగా చాలామంది వస్తారు. కానీ సక్సెస్‌ కావడం కష్టం. ఇది ఆశిష్‌కు బిగ్‌ టార్గెట్‌. ఎంత జడ్జ్‌మెంట్‌ ఉన్నప్పటికీ ప్రేక్షకులు పాస్‌ మార్కులు వేసేంతవరకు టెన్షన్‌ పడతాం. ఆశిష్‌ను లాంచ్‌ చేస్తున్నాం కాబట్టి ఈ సినిమాకు కాస్త ఎక్కువ టెన్షన్‌ పడుతున్నాం’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. ‘దిల్‌’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన ‘రౌడీ బాయ్స్‌’ అక్టోబరులో విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను దర్శకులు వీవీ వినాయక్, మోషన్‌ పోస్టర్‌ను సుకుమార్‌ రిలీజ్‌ చేశారు.


ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘హీరోగా సక్సెస్‌ కాకపోతే మరో ఆప్షన్‌ పెట్టుకోవాలని ఆశిష్‌ను ప్రిపేర్‌ చేస్తూనే ఉన్నాను. కానీ ఆశిష్‌ డ్యాన్స్, ఎనర్జీ లెవల్స్‌ బాగుంటాయి. సక్సెస్‌ అవుతాడనే నమ్మకం ఉంది. దర్శకుడు హర్ష బాగా తీశాడు. సక్సెస్‌ఫుల్‌ సినిమా తీశానని నిర్మాతగా నేనూ నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘ఒకవేళ ఫెయిల్‌ అయితే ఆశిష్‌ దేనికైనా ప్రిపేర్డ్‌గా ఉండాలని ‘దిల్‌’ రాజు చెబుతున్నాడు. కానీ ఆశిష్‌కు ఏ ఆప్షన్స్‌ అవసరం లేదు. కొన్ని సీన్స్‌ చూశాను. బాగా చేశాడనిపించింది’’ అన్నారు వినాయక్‌.

‘‘రౌడీ బాయ్స్‌’లో కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ చూశాను. ఆశిష్‌ బాగా చేశాడు’’ అన్నారు సుకుమార్‌. ‘‘నేను యాక్టర్‌ కావాలని ఫస్ట్‌ కోరుకున్నది అనితా (‘దిల్‌’ రాజు మొదటి భార్య) ఆంటీ. ఆమె లేరు. యాక్టర్‌గా నన్ను గుర్తించిన అనిరతా ఆంటీకి ధన్యవాదాలు’’ అన్నారు ఆశిష్‌. ‘‘రౌడీ బాయ్స్‌’ విడుదల తర్వాత ఆశిష్‌ ఫాదర్‌ శిరీష్‌ అని చెప్పుకుంటారు. ఆ రేంజ్‌లో ఆశిష్‌ నటించాడు’’ అన్నారు హర్ష. ఈ కార్యక్రమంలో నిర్మాతలు లక్ష్మణ్, లగడపాటి శ్రీధర్, శిరీష్, హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ పాల్గొన్నారు.

చదవండి : ముచ్చటగా మూడోసారి!..బుట్టబొమ్మతో బన్నీ స్టెప్పులు
మోహన్‌ లాల్‌, మమ్ముట్టిలకు యూఏఈ అరుదైన గౌరవం


 

మరిన్ని వార్తలు