విషం తాగితే పట్టించుకోరు.. కానీ: నటుడు

14 Dec, 2020 16:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకై రైతులు, రైతు సంఘాలు అవిశ్రాంత పోరాటం చేస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదనలు తిరస్కరించి, తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం, దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల నేతలు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ నటులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా రైతులకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతల డిమాండ్లు నెరవేర్చకపోతే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 

ఇక ఛలో ఢిల్లీ పేరిట రైతు ఆందోళనలు మొదలైన నాటి నుంచి బాలీవుడ్‌ నటుడు, సింగర్‌ దిల్జిత్‌ దోసాంజ్‌ వారికి మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. హర్యానా- ఢిల్లీ సరిహద్దులో సింఘూ వద్ద నిరసనలో పాల్గొని ప్రసంగం చేశాడు. ‘‘రైతుల డిమాండ్లు నెరవేర్చండి. కేంద్రానికి ​ఇదే మా ఏకైక అభ్యర్థన. ఇక్కడ ప్రతి ఒక్కరు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. దేశం మొత్తం వీరి వెంటే ఉంది. ఇది రైతులకు సంబంధించిన ఆందోళన’’ అని అన్నదాతల తరఫున గళం వినిపించాడు. ఈ క్రమంలో నటి కంగనా రనౌత్‌ వంటి వారి నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ వెనకడుగు వేయక రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నాడు.(చదవండి: నేడు రైతు సంఘ నేతల నిరాహారదీక్ష)

ఈ క్రమంలో రైతులు పిజ్జా తింటున్న దృశ్యాలు షేర్‌ చేస్తూ వారి నిరసనను కించపరిచేవిధంగా మాట్లాడుతున్న వారికి దిల్జిత్‌ ట్విటర్‌ వేదికగా గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘రైతులు విషం తాగితే ఎవరూ పట్టించుకోరు. కానీ రైతులు పిజ్జా తింటే మాత్రం అది పెద్ద న్యూస్‌ అవుతుంది. శభాష్‌!’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఆందోళనలో పాల్గొన్న రైతుల కోసం కొంతమంది పిజ్జాలు పంచిపెట్టగా, మరికొంత మంది, కాలినడకన వస్తున్న వారి కోసం మసాజ్‌ కుర్చీలు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై స్పందించిన కొంతమంది నెటిజన్లు.. ‘‘పిజ్జాలు ఉచితంగా పంచుతున్నారు. మసాజ్‌ చెయిర్లు కూడా. ఇది ఆందోళనా లేదా ఫైవ్‌ స్టార్‌ స్పానా? వారి బిల్లులు ఎవరు కడుతున్నారు’’అంటూ విషం చిమ్ముతున్నారు.

మరిన్ని వార్తలు