Dil Raju Thank You Movie: వాళ్లందర్నీ కలిసి థ్యాంక్స్‌ చెప్పాను

19 Jul, 2022 00:35 IST|Sakshi

‘‘రచయిత బీవీఎస్‌ రవి నాలుగేళ్ల క్రితం నాకు ‘థ్యాంక్యూ’ స్టోరీ లైన్‌ చెప్పినప్పుడు ఎగ్జయిట్‌ అయ్యాను. ఇదే లైన్‌ని నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’ ప్రీమియర్‌లో విక్రమ్‌ కుమార్‌కి చెబితే  తను కూడా ఎగ్జయిట్‌ అయ్యి, సినిమా చేద్దాం అన్నాడు. ‘మనం’ చిత్రం తర్వాత విక్రమ్‌కి, చైతన్యకి మధ్య ఉన్న కెమిస్ట్రీ (డైరెక్టర్, హీరోగా) మా సినిమాకి ప్లస్‌ అయింది.

‘థ్యాంక్యూ’లో మూడు పాత్రల్లో నాగచైతన్య అద్భుతంగా నటించాడు’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. అనిత సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు విలేకరులతో పంచుకున్న విశేషాలు.

► బీవీఎస్‌ రవి చెప్పిన స్టోరీ లైన్‌తో ఓ హీరో కేరక్టర్‌ రాయాలనుకున్నాం. ఆ పాత్రకి గతం చెప్పాలనుకున్నాం. అందుకే ‘థ్యాంక్యూ’లో హీరో పాత్రలో కాలేజ్, టీనేజ్‌.. ఇలా అన్నింటినీ డిజైన్‌ చేశాం. స్క్రీన్‌ప్లే, సీన్స్‌ అన్నీ విక్రమ్‌ స్టైల్‌లో రాయమని రవికి చెబితే అలాగే రాశాడు. ∙

► కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నేను కూడా వ్యక్తిగతంగా ‘థ్యాంక్యూ’ జర్నీని స్టార్ట్‌ చేశాను. నాకు స్కూల్లో, ఆటోమొబైల్‌ రంగంలో సహాయం చేసిన వారందర్నీ కలిసి థ్యాంక్స్‌ చెప్పాను. ఇక ఫిల్మ్‌ ఇండస్ట్రీలో థ్యాంక్యూ జర్నీని కంటిన్యూ చేయడానికి ప్రిపేర్‌ అవుతున్నాను. ∙

► ‘థ్యాంక్యూ’ సినిమాలో ఒక సాధారణ కుర్రాడు లెజెండ్‌ అవుతాడు. మొత్తం నేనే అనుకుంటాడు. కానీ అది నిజం కాదు. అతనికి సాయం చేసినవాళ్లు చాలామంది ఉంటారు. అందమైన ప్రేమకథ, వాణిజ్య అంశాలన్నీ కలిపి ఈ       కాన్సెప్ట్‌ని సినిమాటిక్‌గా చెప్పడానికి ఎక్కువ స్ట్రగుల్‌ అయ్యాం. గతం గురించి ఆలోచించే టైమ్‌ ప్రస్తుతం ఎవరికీ లేదు.

► కథ విషయంలో ప్రతి డైరెక్టర్‌తో డిస్కస్‌ చేస్తాను. నా సలహాలను కొందరు డైరెక్టర్లు    వింటారు.. మరికొందరు తామే రైట్‌ అంటారు. అలాంటివాళ్లతో నేను వాదించను. ∙పెద్ద డైరెక్టర్ల అనుభవాలు వాడుకుంటాను. కొత్తవాళ్లకి పాయింట్‌ టు పాయింట్‌ రాసిస్తాను. దానికి రీచ్‌ అవుతున్నామా? లేదా అని చెక్‌ చేస్తాను. మిడ్‌ వాళ్లతో అటూ ఇటూ ఉంటాను.

► కరోనాకి ముందు, కరోనా తర్వాత ప్రేక్షకుల ఆలోచనలు మారిపోయాయి. అంతకుముందు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూద్దామనే మూడ్‌లో ఉన్నారు. లాక్‌డౌన్‌లో ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో చాలా కంటెంట్‌ చూసి, ఎడ్యుకేట్‌ అయ్యారు. ఇప్పుడు వాళ్లకి అంతంత మాత్రం కంటెంట్‌ నచ్చట్లేదు. దీనికోసం ఇంత డబ్బు పెట్టి వెళ్లాలా? అనుకుంటున్నారు. ఈ విషయంలో చిత్ర పరిశ్రమ మారాల్సిన టైమ్‌ వచ్చింది.

మంచి కంటెంట్‌ ఇచ్చి టిక్కెట్‌ ధరలు తగ్గిస్తే జనాలు వస్తారు. ఓటీటీలో త్వరగా సినిమాలు రావడం వల్ల కూడా థియేటర్లకు వచ్చే జనాలు తగ్గారు. మీడియం రేంజ్‌ నుంచి టాప్‌ స్టార్స్‌ సినిమాలు థియేటర్లలో వచ్చాకే ఓటీటీకి వెళ్లాలి. అది ఎన్ని వారాలకు? అనేది నిర్మాతలందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య వచ్చిన ‘మేజర్, విక్రమ్‌’ సినిమాల కంటెంట్‌ బాగుండటంతో ప్రేక్షకులు ఆదరించారు... మంచి కంటెంట్‌ ఉంటే హిట్‌ చేస్తారు.

► ఒక సినిమా ఫ్లాప్‌కు చాలా కారణాలుంటాయి. కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక ఇబ్బందులవల్ల జనాల్లో డబ్బు ఖర్చు చేసే సత్తా కూడా తగ్గింది. ప్రొడక్షన్‌ కాస్ట్‌ తగ్గించడం అనేది గతంలో నిర్మాత సమస్య. కానీ ఇప్పుడు సినిమాది. అందుకే అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ప్రతి సినిమాకీ డబ్బు పోతుందని తెలిస్తే బాధ ఉంటుంది. ఈ విషయం డైరెక్టర్లకీ, హీరోలకి కూడా అర్థమైంది.      హిందీలో తీసిన ‘హిట్‌’ సినిమాకి మేం నష్టపోలేదు. కానీ, ‘జెర్సీ’ రీమేక్‌ని కరోనా పరిస్థితుల్లో రిలీజ్‌ చేయడం వల్ల 3–4 కోట్ల డ్యామేజ్‌తో బయటపడ్డాం.

ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఓటీటీలో సూపర్‌హిట్‌ అయినా వచ్చేదేమీ లేదు. అదే సినిమా థియేటర్లలో రిలీజ్‌ అయితే ఆ వసూళ్లు, ఆ ఎనర్జీ వేరు. ప్యాషన్‌గా సినిమా తీయాలనుకున్నవారికి డబ్బులతో పాటు ఎనర్జీ కూడా ముఖ్యమే. హీరోలందరికీ ప్రస్తుత పరిస్థితు (నిర్మాణ వ్యయాన్ని ఉద్దేశించి) లను, సమస్యను చెబితే అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. 

మరిన్ని వార్తలు