Jayamma Panchayati: ఓ పక్క జిమ్‌ నిర్వహిస్తూనే సినిమాల్లో ట్రై చేశా

13 May, 2022 14:40 IST|Sakshi

ఇటీవల విడుదలైన జయమ్మ పంచాయితీ చిత్రం తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని చిత్ర కథానాయకుడు కదంబాల దినేష్‌కుమార్‌ అన్నారు. పాలకొండ పట్టణంలోని ఆంజనేయనగర్‌ కాలనీకి చెందిన ఆయన సినిమా విడుదల అనంతరం గురువారం స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను పట్టణంలోనే ఓ జిమ్‌ నిర్వహిస్తున్నానని చెప్పారు. సినీరంగంపై ఉన్న మక్కువతో ముమ్మర ప్రయత్నం చేశానని, ఈ నేపథ్యంలో జయమ్మ పంచాయితీలో అవకాశం లభించినట్లు తెలిపారు. మండలంలోని కోటిపల్లికి చెందిన కలివరపు విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో ఇదీ ప్రాంతంలో చిత్రాన్ని తెరకెక్కించిన వైనాన్ని వివరించారు.

స్థానికంగా పలువురు ఇందులో నటించడంతో చిత్రానికి మరింత బలం చేకూరిందని, ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తన నటనకు అభినందనలు తెలియజేయడం మర్చిపోలేని విషయమన్నారు. ప్రముఖ నటి, బుల్లితెర యాంకర్‌ సుమ ప్రధాన భూమిక పోషించిన ఈ చిత్రానికి ప్రజల్లో, సినీ వర్గాల్లో మంచి ఆదరణ రావడం సంతోషంగా ఉందన్నారు. తొలి సినిమాతోనే హీరోగా గుర్తింపు రావడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు. కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతోనే ఇది సాధ్యమైందని సంతృప్తి వెలిబుచ్చారు. ఇటీవల సాక్షి లైవ్‌ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లభించిందని తెలిపారు.

చదవండి: క్రాక్‌ సినిమా కథ నాదే: రచయిత ఫిర్యాదు

 కరాటే కల్యాణిపై శ్రీకాంత్‌ సంచలన ఆరోపణలు

మరిన్ని వార్తలు