కోబ్రా ఫ్లాప్‌తో నిరాశలో ఉన్న నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది ఈ హీరోనే..

18 Dec, 2023 12:33 IST|Sakshi

డీమాంటి కాలనీ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యాడు అజయ్‌ జ్ఞానముత్తు. ఈ సినిమా సక్సెస్‌తో చిత్త పరిశ్రమ దృష్టిని తనవైపు మరల్చుకున్నాడు. ఆ తర్వాత నయనతార- విజయ్‌ సేతుపతిలను హీరోహీరోయిన్లుగా పెట్టి తీసిన ఇమైకా నొడిగల్‌ సినిమా సూపర్‌ సక్సెస్‌ అయింది. అయితే ఆ తర్వాత విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన కోబ్రా చిత్రం డిజాస్టర్‌గా మారింది. తాజాగా ఈయన డీమాంటి కాలనీ – 2 సినిమాను డైరెక్ట్‌ చేశాడు. ఇది ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించిన డీమాంటి కాలనీకి సీక్వెల్‌ కావడం గమనార్హం.

బీటీజీ యూనివర్సల్‌ సంస్థ అధినేత బాబి బాలచంద్రన్‌ సమర్పణలో జ్ఞానముత్తు పట్టరై, వైట్‌ నైట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రంలో అరుళ్‌నిధి, ప్రియా భవాని శంకర్‌ జంటగా నటించిన ఇందులో నటుడు అరుణ్‌ పాండియన్‌, నటి మీనాక్షి గోవిందరాజన్‌, ముత్తుకుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందించిన ఈ హారర్‌, థ్రిల్లర్‌ కథా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని వీఆర్‌ మాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. తన గత చిత్రం కోబ్రా ప్లాప్‌ అయిందని, అయితే ఎందుకది ఫ్లాప్‌ అయిందో అర్థం కాక నిరాశతో ఉన్నప్పుడు నటుడు అరుళ్‌ నిధి వచ్చి జరిగినదాన్ని మర్చిపోండి మనం మళ్లీ సినిమా చేద్దామని భుజం తట్టి ప్రోత్సహించారన్నాడు. అప్పటి నుంచి నేటి వరకు ఆయన తన వెన్నంటే ఉన్నారన్నాడు. ఇలాంటి మంచి వ్యక్తులు తన చుట్టూ ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ చిత్రం ద్వారా తన తండ్రిని నిర్మాతను చేయాలన్న కోరిక నెరవేరిందన్నాడు.

చదవండి: బిగ్‌బాస్ 7 టైటిల్‌ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం..

>
మరిన్ని వార్తలు