నా తర్వాతి సినిమాలో తెలుగమ్మాయే హీరోయిన్‌

23 May, 2021 00:51 IST|Sakshi

‘‘1990 వరకూ తెలుగు నుంచి చాలామంది హీరోయిన్లు వచ్చి స్టార్లు అయ్యారు. ఆ తర్వాత కాలంలో ప్రతిభావంతమైన తెలుగమ్మాయిలు వచ్చినా మంచి అరంగేట్రం దొరక్క, అనుకున్నంత స్థాయిలో మెరవలేక మరుగున పడిపోతున్నారు. నా తర్వాతి చిత్రానికి తెలుగమ్మాయినే కథానాయికగా పరిచయం చేస్తా. తను స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంటే హ్యాపీ’’ అని దర్శక–నిర్మాత వైవీఎస్‌ చౌదరి అన్నారు. ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్కమగాడు, సలీం, నిప్పు, రేయ్‌’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు వైవీఎస్‌ చౌదరి. ఆదివారం ఆయన పుట్టినరోజు.

ఈ సందర్భంగా వైవీఎస్‌ మాట్లాడుతూ – ‘‘చదువులో నేను ఫస్ట్‌ ర్యాంకర్‌ని. నందమూరి తారక రామారావుగారి స్ఫూర్తితో చదువును వదిలి చిత్రపరిశ్రమలోకి వచ్చాను.. సంతృప్తిగా ఉన్నాను. సినిమా ఓ అనిర్వచనీయమైన వ్యామోహం. ఈ రంగంలో ప్రతి శుక్రవారం సబ్జెక్టు మారుతుంది.. దానికి తగ్గట్లు సినిమాలు నిర్మించడం అన్నది పెద్ద ఛాలెంజ్‌. దర్శకునిగా నా కెరీర్‌ మొదలైన 23 ఏళ్లలో 10 సినిమాలే చేశా. రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఒత్తిడి లేకుండా సినిమాలు చేయాలనుకుంటాను. అందుకే సినిమా సినిమాకి గ్యాప్‌ వస్తుంటుంది. ఎన్టీఆర్, మహేశ్‌బాబు వంటి స్టార్‌లతో సినిమా చేయాలని ఎవరికి ఉండదు? అన్నీ కలిసిరావాలి. నా తర్వాతి సినిమాకి కథ రెడీ. కోవిడ్‌ ఉధృతి తగ్గాక ప్రారంభిస్తా’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు