ట్రైలర్‌ చాలా నచ్చింది

22 Sep, 2022 03:47 IST|Sakshi
మహతి స్వర సాగర్, అనిల్‌ రావిపూడి, అనీష్‌ కృష్ణ, నాగశౌర్య, షిర్లే, ఉషా ముల్పూరి

– అనిల్‌ రావిపూడి

‘‘కృష్ణ వ్రింద విహారి’ రెండున్నరేళ్ల ప్రయాణం. కోవిడ్‌ కారణంగా చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ సినిమా నిర్మాతలైన మా అమ్మానాన్న ధైర్యంగా నిలబడి సినిమాని గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.. ఇలాంటి అమ్మానాన్నకు కొడుకుని కావడం నా అదృష్టం’’ అని నాగశౌర్య అన్నారు. అనీష్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లే సేథియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’.

శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్‌ చాలా నచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంది. ఈ సినిమా శౌర్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది’’ అన్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘అనీష్‌ కృష్ణ నాకో మంచి సినిమా ఇవ్వబోతున్నారనే నమ్మకం ఉంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది.. ఫలితం ఏదైనా శిరస్సు వంచి తీసుకుంటా.. మీ (ప్రేక్షకుల) నమ్మకం పోగొట్టుకోను’’ అన్నారు. ‘‘ఈ సినిమాని నాగశౌర్యగారు బలంగా నమ్మారు కాబట్టే పాదయాత్ర చేశారు’’ అన్నారు అనీష్‌ ఆర్‌. కృష్ణ.  

మరిన్ని వార్తలు