నటుడిగా మారిన డైరెక్టర్‌ మునియసామి

7 Oct, 2022 10:28 IST|Sakshi

తమిళసినిమా : మహిళలకు రక్షణ కల్పించే ప్రస్తుత చట్టాలు సవరించాలనే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఓంకారం అని దర్శకుడు ఏఆర్‌ కేందిరన్‌ మునియసామి తెలిపారు. ఇంతకుముందు అయ్యన్, సేతుభూమి వంటి చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా కథానాయకుడిగా మారి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఇది. నటి వర్ష విశ్వనాథ్‌ నాయకిగానూ, శ్రీధర్, మదన్‌ మునుస్వామి, జిత్తామురుగన్, శివకుమార్, డెల్టా వీర తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి శ్యామ్‌ కె. రొనాల్డ్‌ చాయాగ్రహణం, వీటీ భారతి, వీటీ మోనీష్‌ ద్వయం సంగీతాన్ని అందిస్తోంది.

ఎల్లో సినిమాస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కౌసల్య నిర్మిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. ఇది మదురై నేపథ్యంలో రూపొందిస్తున్న కథా చిత్రమని తెలిపారు. ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్‌ అంటూ జనరంజకమైన అంశాలు అనేకం ఉంటాయని చెప్పారు. చిత్ర షూటింగ్‌ మదురైలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధిక భాగం నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే చిత్ర టీజర్, ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి మంచి ప్రేక్షక ఆదరణ లభిస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు