నేను సాఫ్ట్‌ కానీ, నా సినిమాల్లో మాత్రం హింస ఎక్కువ.. కారణం ఇదే: బి.గోపాల్‌

6 Oct, 2021 16:20 IST|Sakshi

ఆకతాయి కొడుకు, స్ట్రిక్ట్‌ తండ్రి అనే కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ‘ఆరడుగుల బుల్లెట్’లో ఎమోషన్స్‌ బాగుంటాయి. ఫాదర్ అండ్ సన్ రిలేషన్, నయనతారతో లవ్ స్టోరీ, విలన్స్‌తో క్లాష్ హై ఓల్టేజ్‌గా ఉంటుంది. గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్ ఇది’అన్నారు దర్శకుడు బి.గోపాల్‌. మ్యాచో స్టార్ గోపీచంద్ - నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్  ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 8న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా దర్శకుడు బీ గోపాల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ఆరడుగుల బుల్లెట్ ఓ కమర్షియల్ సినిమా. తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. ఆ తండ్రి కొడుకును ఎంతలా అపార్ఠం చేసుకున్నాడు.. ఎంతలా మిస్ అయ్యాడు.. ఆ ఫ్యామిలీని అతను ఎలా కాపాడాడు అనేదే కథ.

ఆకతాయి కొడుకు, స్ట్రిక్ట్‌ తండ్రి అనే కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి. వక్కంతం వంశీ కథ, అబ్బూరి రవి మాటలు బాగున్నాయి.

 వక్కంతం వంశీ అందించిన  కథ నిర్మాతలకు, గోపీచంద్ అందరికీ నచ్చడంతోనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టాం.

► 1985లో దర్శకుడిని అయ్యాను. కానీ నేను చేసింది 35 సినిమాలే. మామూలుగా అయితే వందల సినిమాలు చేయోచ్చు. కానీ నాకు కథ, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తాను. అందరికీ నచ్చేలా ఉంటేనే సినిమాను చేస్తాను.

► నేను చేసినవి ఏవీ కూడా నా కథలు కాదు. సీనియర్ రచయితలు,కొత్త రచయితలను అందరినీ అడుగుతుంటాను. మస్కా సినిమాతో కొత్త రచయితను పరిచయం చేశాను. చిన్ని కృష్ణను కూడా నేనే పరిచయం చేశాను. నాకు కథ నచ్చితేనే సినిమాకు న్యాయం చేయగలుగుతాను. 

► స్క్రిప్ట్ బాగుంటే.. సూపర్ హిట్ అవుతాయి. లేదంటే ఫ్లాప్ అవుతాయి. క్రాక్ జనాలకు నచ్చింది. కాబట్టే సూపర్ హిట్ అయింది. చివరకు జనాలకు నచ్చితేనే ఆడుతాయి. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇంద్ర బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.

► ఓటీటీ కంటెంట్లను కూడా జనాలు బాగానే చూస్తున్నారు. కానీ నాకు మాత్రం థియేటర్లోనే సినిమా చూడటం ఇష్టం. పెద్ద తెరపై సినిమా చూసేందుకే జనాలు ఇష్టపడతారు.

► ఫ్యాక్షన్ కథ చేస్తున్నామని సినిమా చేస్తున్నంత వరకు నాకు తెలీదు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఇంద్ర సమయంలోనూ ఫ్యాక్షన్ సినిమా చేస్తున్నాను అని అనుకోలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా కథ చెబితే.. ఫ్యాక్షన్ డ్రాప్‌లో డైరెక్షన్ చేసేందుకు రెడీగా ఉన్నాను. బాలయ్య బాబుతో సినిమా చేయాలని చాలా ట్రై చేశాను. కానీ స్క్రిప్ట్ సరిగ్గా రాకపోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. బాలయ్య బాబుతో సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి కంటే బ్లాక్ బస్టర్ హిట్ తీయాలనే కోరిక ఉంది. 

► నేను సాఫ్ట్‌గా ఉంటాను. మైకుల ముందు కూడా మాట్లాడటం రాదు. కానీ సినిమాల్లో మాత్రం హింస ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం నా స్క్రిప్ట్ రైటర్స్. స్క్రిప్ట్‌ను బట్టి, నా హీరోలను బట్టి ఓ డైనమిక్  షాట్‌ను పెట్టాలనిపిస్తుంది. అందుకే అలాంటి సీన్స్ పడ్డాయి.

► సినిమా అంటే పాటలు, ఫైట్లు పెడతాను. కానీ సిట్యువేషన్‌ను బట్టి ఫైట్లు పెడతాను. నరసింహానాయుడు ట్రైన్ సీక్వెన్స్‌లో బాలయ్య బాబుకు గొడ్డలి తగులుతుంది. ఆ సీన్‌కు అందరూ ప్రశంసలు కురిపించారు. కమర్షియల్ సినిమాలను ఆడియెన్స్‌కు నచ్చేట్టుగా తీయాలని ప్రయత్నిస్తాను.

మరిన్ని వార్తలు