Director Bharathiraja : భారతీరాజా హాస్పిటల్‌ ఖర్చులకు డబ్బుల్లేవా? కొడుకు ఏమన్నాడంటే..

10 Sep, 2022 08:33 IST|Sakshi

తమిళసినిమా: సీనియర్‌ దర్శకుడు భారతీరాజా శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గత నెల 26వ తేదీ అనారోగ్యంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి వైద్య చికిత్సలు పొందుతున్న విషయం తెలిసిందే. రెండు వారాల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండటంతో ఆయనకు ఏమైందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సంపూర్ణ ఆరోగ్యంతో భారతీరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి స్థానిక నీలాంగరైలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన బులిటెన్‌ ఎంజీఎం ఆసుపత్రి నిర్వాహకులు మీడియాకు విడుదల చేశారు.

అందులో దర్శకుడు భారతీరాజా అల్టెరెడ్‌ సెంజూరిమ్‌ సమస్యతో గత నెల 26వ తేదీన తమ ఆసుపత్రిలో చేరారన్నారు. ఆయనకు అత్యవసర వైద్యవార్డులో చికిత్సలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం భారతీరాజా కోరుకున్నారని దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు తెలిపారు. కాగా భారతీరాజా కొడుకు మనోజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి పూర్తిగా కోలుకున్నారని మునుపటి భారతీరాజాను చూడొచ్చని చెప్పారు.

అయితే ప్రచారం జరుగుతున్నట్లు తన తండ్రి ఆస్పత్రి ఖర్చులకు ఇబ్బంది పడలేదని, సాయం కూడా కోరలేదని, అలాంటి అవసరం తమకు లేదని వివరించారు. గీత రచయిత వైరముత్తు, ఏసీ షణ్ముగం సలహా మేరకు తన తండ్రిని వైద్య చికిత్స కోసం ఎంజీఎంలో చేర్చినట్లు చెప్పారు. తన తండ్రి ఇంత త్వరగా కోలుకోవడానికి కారణం  ఆస్పత్రి వైద్యులేనని మనోజ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు