వైరముత్తుకు సీఎం, రాజకీయ నేతలు అండగా నిలవాలి : భారతీరాజా

31 May, 2021 08:31 IST|Sakshi

చెన్నై: సినీ గీత రచయిత వైరముత్తుకి సీఎం, రాజకీయ నాయకులు అండగా నిలవాలని సీనియర్‌ దర్శకుడు భారతీరాజా విజ్ఞప్తి చేశారు. గీత రచయిత వైరముత్తు నాలుగైదు రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ప్రఖ్యాత దివంగత కవి, గీత రచయిత ఓఎన్‌వీ గురుప్‌ పేరుతో నెలకొల్పిన ఓ ఎన్‌ వి జాతీయ సాహితీ అవార్డును వైరముత్తుకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనంతరం ఆయన ఈ అవార్డును ప్రకటించడంపై మలయాళనటి పార్వతి, గాయని చిన్మయి వంటి వారు తీవ్రంగా వ్యతిరేకించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఓ ఎన్‌ వి జాతీయ సాహితీ అవార్డును ప్రధానం చేయడమా? అంటూ విమర్శించారు. దీంతో ఓ ఎన్‌ వి సాంస్కృతిక అకాడమీ నిర్వాహకులు వైరముత్తుకు ఈ అవార్డును ప్రదానం చేయనుండటంపై పునరాలోచన చేస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారం వైరముత్తుకు తీవ్ర అవమానమే అనిచెప్పవచ్చు. అయితే ఈ అవార్డును అందుకోకుండానే వైరముత్తు దాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి విమర్శలకు గురయ్యారు.

ఇలాంటి పరిణామాల మధ్య సీనియర్‌ దర్శకుడు భారతీరాజా వైరముత్తుకు అండగా నిలిచారు. ఆయన శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. భాష, రాజకీయ విద్వేషాలు కలిగి ఎక్కడి నుంచో వచ్చి మాతృభూమికి కళంకం ఏర్పరిచే విధంగా కొందరు మతం, జాతి, భాష పేరుతో విడగొట్టే దాడులు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను తమిళులమైన మనమందరం పుల్‌స్టాప్‌ పెట్టాలి. ప్రపంచ తమిళుందరితో కవి పేరరసు అనే బిరుదుతో గంభీరంగా నిలబడే కవి మిమ్మల్ని వంచాలని ప్రయత్నించే వారి కల కలగానే మిగిలిపోతుంది. తమిళులకు ఎప్పుడు అండగా నిలబడి తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు, ఇతర రాజకీయ వాదులు వైరముత్తుకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నానని దర్శకుడు భారతీరాజా పేర్కొన్నారు.

చదవండి : వైరముత్తుకు భారీ షాక్‌.. ఓఎన్‌వీ అవార్డు వెనక్కి?
లైంగిక ఆరోపణలేగా!.. మేమూ తగ్గం

మరిన్ని వార్తలు