K Viswanath Death: యువత పాశ్చాత్య పోకడలపై కళాతపస్వీ విశ్వనాథ్‌ ఏమన్నారంటే..

3 Feb, 2023 14:57 IST|Sakshi

నిజమైన కళ అంటే.. కనులకు, చెవులకు ఆనందాన్నిచ్చేది కాదు. మనుసును ఆహ్లాదపరిచేది. అలాంటి కళతో జనాలను రంజింపజేసిన కళాకారుడు చరితార్థుడువుతాడు. కె. విశ్వనాథ్‌ ఆ కోవకు చెందిన వారే. పాశ్చాత్య పోకడల పెను తుఫాను తాకిడికి రెప రెపలాడుతున్న భారతీయ కళాజ్యోతిని తన సినిమాలతో ప్రజ్వలింపజేసిన మహోన్నతుడు కె. విశ్వనాథ్‌. ఆయన సృజించిన ప్రతి చిత్రం.. నటరాజ పాదపద్మాలను స్మృశించిన స్వర్ణకమలమే.

   ఆయన కెరీర్‌లో వచ్చిన మరపురాని చిత్రాల్లో స్వర్ణకమలం ఒకటి. ఈ సినిమా పాతికేళ్ల సందర్భంగా గతంలో కె విశ్వనాథ్‌ ఓ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మూవీ విశేషాలతో పాటు పాశ్యాత్య పోకడలకు నేటితరం చూపిస్తున్న ఆసక్తిపై ఆయన స్పందించారు. మరి ‘స్వర్ణకమలం’ మూవీ ఎలా పుట్టింది, ఈ చిత్రం గురించి ఆయన ఏమన్నారో మరోసారి గుర్తు చేసుకుందామా!

కళ దైవదత్తం. జన్మ జన్మల పుణ్యం వల్లే అది ప్రాప్థిస్తుంది. ఆ నిజాన్ని గ్రహించలేదని వేదాంతం వారి అమ్మాయి కథ ఇది. ‘సమాజం జెట్‌ వేగంతో వెళుతోంది. దాంతో పాటే మనమూ వెళ్లాలి. అంతేకాని సంప్రదాయ కళలనే శ్వాసిస్తూ అదే మోక్షంగా భావిస్తూ కూపస్త మండూకాల్లా బతకడం ఎంత వరకు సమంజసం’ అని వాదిస్తుందీ పాత్ర. పాతికేళ్ల క్రితం విశ్వనాథ్‌ సృష్టించిన ఈ మీనాక్షి పాత్ర.. నాటి అమ్మాయిలకే కాదు.. నేటి  అమ్మాయిలకు రేపటి అమ్మాయిలకు అద్దమే. ఆ పాత్రలో భానుప్రియ ఒదిగిన తీరు అనితరసాధ్యం. చిత్తశుద్దీ ఏకాగ్రత తోడైతే.. ఏ కళైనా అజరామరం అవుతుందని ఆ పాత్ర తెలుసుకోవడమే స్వర్ణకమలం. 

ఇప్పటికీ ‘స్వర్ణకమలం’ చిత్రాన్ని స్మరించుకుంటున్నారంటే కారణం?
‘సంప్రదాయ కళలపై ఇష్టంతో జనహృదయాలపై వాటిని ఉన్నతంగా నిలపాలనే ఉన్నతమైన ధ్యేయంతో సినిమాలు తీశాను. వాటిల్లో ఒకటే స్వర్ణకమలం. సంప్రదాయ కళలపై వృత్తి విద్యలపై ప్రస్తుతం యువతరానికి నమ్మకం పోయింది. మనది కానిది వాటిపైనే వారు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విధానం తప్పని ఈ సినిమాలో చెప్పాను. ఇళయరాజా సింగీతం, సిరివెన్నెల సాహిత్యం ఈ చిత్రానికి రెండు కళ్లు. ఇందులో భానుప్రియ నటనకు నాట్యాలకు మంచి పేరొచ్చింది. చివరి పాట తప్ప అనిన పాటలకు శేషు, ముక్కురాజు కొరియోగ్రఫి ఇచ్చారు. చివరి పాట అందెల రవమిది పదములదా పాటలకు మాత్రం సుప్రసిద్ద హిందీ కొరియోగ్రాఫర్‌ గోపీకృష్ణ చేశారు’ అని ఆయన చెప్పుకొచ్చారు. 

రెండున్నర గంటల పాటు సాగే ఈ సినిమాలో ఒక్క నాట్యం గురించే కాదు. మన సంస్కృతి సంప్రదాయం భక్తి, ప్రేమ, తిరుగుబాటు.. ఇలా ఎన్నో అంశాలను స్మృశించారు కె. విశ్వనాథ్‌. హృదయాలను బరువెక్కించే భావోద్వేగం, ఆహ్లాదపరిచే హాస్యం ఈ ఆసినిమాకు అలంకారాలు. వెంకటేశ్‌. భానుప్రియ సాక్షి రంగరావు, శ్రీలక్ష్మి, షణ్ముఖ శ్రీనివాస్‌, కేఎస్‌టీ సాయి.. ఇలా ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు జీవం పోశారు.  

మరిన్ని వార్తలు