'కథ చెప్పడానికి ఫోన్‌ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు'

26 Aug, 2021 08:09 IST|Sakshi

‘‘పరభాషా చిత్రాలు చూసి తెలుగులో అలాంటివి రావడం లేదని ఆ చిత్రాలను అభినందిస్తుంటాం. ‘శంకరాభరణం, సిరివెన్నెల, జ్యోతి, విజేత, ఛాలెంజ్‌’ వంటి లిటరేచర్‌ బేస్డ్‌ సినిమాలు తెలుగులో వచ్చినన్ని ఇతర భాషల్లో రాలేదు. ప్రపంచాన్ని షేక్‌ చేసిన ‘అరుంధతి, బాహుబలి’ వంటి సినిమాలు కూడా తెలుగులోనే వచ్చాయి. కథలు చెబుదామనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను రాసుకునే సినిమా కథల్లో కథలే హీరోలు’’ అన్నారు కరుణ కుమార్‌.

సుధీర్‌బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించిన ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా కరుణ కుమార్‌ మాట్లాడుతూ – ‘‘అమలాపురం పక్కన ఉన్న గ్రామాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఓ సోడా సెంటర్‌ యజమాని కూతుర్ని ఓ ఎలక్ట్రీషియన్‌ ప్రేమిస్తాడు. అక్కడి ప్రాంతాల్లోని సాంఘిక, ఆర్థిక, సామాజిక పరమైన ఇబ్బందుల వల్ల వీరి ప్రేమకథ ఏమైంది? అన్నదే ఈ సినిమా కంథాంశం.

సుధీర్‌కి రెండు కథలు చెబితే,  ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ను సెలక్ట్‌ చేసుకున్నారు. నిర్మాతలు మంచి ఫ్రీడమ్‌ ఇచ్చారు. ఈ సినిమాలో మణిశర్మగారి కొత్తరకం బాణీలు వింటారు’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. నా సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం కొంతమంది తెలుగు అమ్మాయిలకు ఫోన్‌ చేయగా, కొందరు సినిమాలో ‘హీరో ఎవరు?’ అని అడిగారని, మరికొందరు వాళ్ల మేనేజర్‌కు కథలు చెప్పమన్నారనీ.. అంతేకానీ కథలు ఎవరూ వినలేదనీ అన్నారు కరుణ కుమార్‌.
 

చదవండి : ‘సర్కారువారి పాట’ : గోవా షెడ్యూల్‌ పూర్తి 
అందగత్తెను కాదని ఎగతాళి చేశారు: నటి భావోద్వేగం


 

మరిన్ని వార్తలు