డైరెక్టర్‌ కేవీ ఆనంద్‌కు కన్నీటి నివాళి

1 May, 2021 08:10 IST|Sakshi

మరో సీనియర్‌ నటుడు సెల్లదురై మృతి

చెన్నై :  ప్రముఖ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు కేవీ ఆనంద్‌(54) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన కేవీ ఆనంద్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో గుండెపోటు వచ్చి ప్రాణాలు విడిచారు. నటులు రజనీకాంత్, కమల్‌ హాసన్, ధనుష్, గీత రచయిత వైరముత్తు, ఖుష్బూ, రాధిక శరత్‌ కుమార్, నిర్మాతలు అఘోరం, పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, తమిళ నిర్మాతల మండలి ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆనంద్‌కుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన పార్థివదేహాన్ని ఆయన ఇంటి వద్ద కాసేపు సందర్శనార్థం ఉంచారు. స్థానిక బీసెంట్‌ నగర్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 

ఇదీ సినీ నేపథ్యం.. 
కేవీ ఆనంద్‌ ఛాయాగ్రాహకుడుగా, దర్శకుడిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. చెన్నై లయోలా కాలేజీలో విజువల్‌ కమ్యూనికేషన్‌ పూర్తిచేసిన ఈయన సినీ రంగంపై ఆసక్తితో తొలి రోజుల్లో నిశ్చల ఛాయాగ్రహకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. తమిళ వారపత్రికలో ఫోటో జర్నలిస్టుగా కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ వద్ద సహాయకుడిగా చేరారు. మోహన్‌లాల్‌ నటించిన మలయాళ చిత్రం తెన్‌ మావిన్‌ కొంబత్తు చిత్రం ద్వారా ఛాయగ్రాహకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రం తోనే 1994లో జాతీయ ఉత్తమ ఛాయాగ్రాహకుడు అవార్డును అందుకున్నారు. ఆపై తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సత్తా చాటారు.

తమిళంలో శంకర్, మణిరత్నం చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. తెలుగులో పుణ్యభూమి నాదేశం చిత్రం ద్వారా ఛాయాగ్రహాకుడిగా పరిచయం అయ్యారు. దర్శకుడిగా శ్రీకాంత్‌ కనా కండేన్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తరు సూర్య హీరోగా అయన్, మాట్రాన్, కాప్పాన్‌ చిత్రాలతోపాటు జీవా కథానాయకుడు నటించిన కో, ధనుష్‌ హీరోగా అనేగన్, విజయ్‌ సేతుపతి హీరోగా కవన్‌ చిత్రాలను తెరకెక్కించారు. ఈయన దర్శకత్వం వహించిన చివరి కాప్పాన్‌. శింబు కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. ఆలోపే ఆయన కన్నుమూశారు. 

మరో సీనియర్‌ నటుడు కన్నుమూత  
మరో సీనియర్‌ నటుడు సెల్లదురై(84) గురువారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన జాన్సన్, శివాజీ, కత్తి, మారి, రాజారాణి, మనిదన్‌ వంటి చిత్రాల్లో నటించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వ సర్వే డిపార్ట్‌మెంట్‌లో పదవీ విరమణ చేసిన తరువాత సినీరంగ ప్రవేశం చేశారు. అంతేకాకుండా సెల్లదురై రంగస్థల నటుడు కూడా. ఈయన భౌతిక కాయానికి శుక్రవారం సాయంత్రం స్థానిక కీలప్పాకం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.  

మరిన్ని వార్తలు