Director Mohan Raja: ‘లూసిఫర్‌’లో లేనిది గాడ్‌ ఫాదర్‌లో ఉంది! 

4 Oct, 2022 08:55 IST|Sakshi
‘గాడ్‌ ఫాదర్‌’ డైరెక్టర్‌ మోహన్‌ రాజా

‘‘మలయాళ ‘లూసిఫర్‌’ కి నేను పెద్ద అభిమానిని. ఆ సినిమాని గొప్పగా ప్రేమించి ఇంకా గొప్పగా తీసిన సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’ అని డైరెక్టర్‌ మోహన్‌ రాజా అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. సల్మాన్‌ ఖాన్‌ , నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు చేశారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా రేపు (బుధవారం) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మోహన్‌ రాజా  పంచుకున్న విశేషాలు. 

నేను పుట్టింది తమిళనాడులో అయినా దర్శకుడిగా జన్మనిచ్చింది తెలుగు చిత్రపరిశ్రమ. మా నాన్నగారు (ఎడిటర్‌ మోహన్‌) వేసిన బాటలో నేను, తమ్ముడు (‘జయం’ రవి) ప్రయాణిస్తున్నాం. తెలుగులో 10 ఏళ్లలో 9 వరుస హిట్లు అందుకున్నారు నాన్నగారు. రవిని హీరోగా చేసేందుకు తమిళ  ఇండస్ట్రీకి షిఫ్ట్‌ అయ్యాం.

⇔ నా తొలి తెలుగు చిత్రం ‘హనుమాన్‌ జంక్షన్‌’ విడుదలై 21 ఏళ్లు అయింది. ఇన్నేళ్ల తర్వాత తెలుగులో ‘గాడ్‌ ఫాదర్‌’ చేయడం గర్వంగా ఉంది. ఇన్నేళ్లు తెలుగుకి దూరంగా  ఉన్నాననే భావన కలగ లేదు.. ఎందుకంటే ఆరు తెలుగు సినిమాలను వరుసగా తమిళ్‌లో రీమేక్‌ చేశా. 

⇔ ఎన్వీ ప్రసాద్‌గారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నన్ను మళ్లీ తెలుగులోకి రమ్మని పిలిచేవారు. ఒకసారి మహేశ్‌బాబు దగ్గరికి కూడా తీసుకెళ్లారు. ‘తని వరువన్‌’ (ధృవ) నుండి రామ్‌ చరణ్‌తో పరిచయం. ‘ధృవ –2’ గురించి చర్చలు జరుపుతున్న సమయంలో ‘లూసిఫర్‌’ రీమేక్‌ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిగా నా పేరుని ఎన్వీ ప్రసాద్‌గారు సూచించడంతో చిరంజీవిగారు, చరణ్‌లు ఓకే అన్నారు. ‘లూసిఫర్‌’ లో నాకు దొరికిన ఒక కొత్త కోణం చిరంజీవిగారికి చాలా నచ్చింది. 

⇔ ‘లూసిఫర్‌’లో లేని ఒక కోణం ‘గాడ్‌ఫాదర్‌’లో ఉంటుంది. కథని అలాగే ఉంచి ఫ్రెష్‌ స్క్రీన్‌ ప్లే చేశాను. ఇందులోని పది పాత్రలు చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి.  ‘గాడ్‌ఫాదర్‌’ చిరంజీవిగారి ఇమేజ్‌కి తగ్గ కథ. ఈ కథకి సరిపడే ఇమేజ్‌ ఉన్న హీరోలు ఇండియాలో ఓ ముగ్గురు మాత్రమే ఉంటారు.

⇔ ‘లూసిఫర్‌’లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చేసిన పాత్రలో సల్మాన్‌ఖాన్‌గారు బాగుంటుందనే ఆలోచన నాదే. రామ్‌చరణ్‌ అడగ్గానే చిరంజీవిగారిపై ఉన్న ప్రేమతో ఈ మూవీ ఒప్పుకున్న సల్మాన్‌కి థ్యాంక్స్‌. చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌లాంటి మెగాస్టార్లని డైరెక్ట్‌ చేయడం చాలా ఒత్తిడిగా ఉంటుంది.. అయితే చిరంజీవిగారు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను.

⇔ చిరంజీవిగారితో మా నాన్నగారు ‘హిట్లర్‌’ అనే హిట్‌ మూవీ నిర్మించారు. నేను ‘గాడ్‌ఫాదర్‌’ అనే హిట్‌ ఇవ్వబోతుండటం హ్యాపీ. మలయాళంలో ‘లూసిఫర్‌ 2’ మొదలైంది. ప్రస్తుతం నా దృష్టి ‘గాడ్‌ ఫాదర్‌’ పైనే ఉంది. అయితే ఈ సినిమా సీక్వెల్‌కి మంచి కంటెంట్‌ ఉంది. 

మరిన్ని వార్తలు