అల్లు అర్జున్‌ మామ నిర్మాతగా వెదిరె రామచంద్రా రెడ్డి జీవిత కథ

13 Sep, 2021 05:47 IST|Sakshi
అరవింద్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, నీలకంఠ

– నీలకంఠ

‘‘వెదిరె రామచంద్రా రెడ్డిగారు ఇచ్చిన మొదటి భూదానం భారతదేశానికే కొత్త అర్థం చెప్పింది. ఆయనది గొప్ప చరిత్ర. ఆయన జీవితాన్ని తెరకెక్కించే బాధ్యతను నాపై పెట్టిన చంద్రశేఖర్‌రెడ్డికి ధన్యవాదాలు’’ అని దర్శకుడు నీలకంఠ అన్నారు. పోచంపల్లికి చెందిన ప్రథమ భూదాత వెదిరె రామచంద్రా రెడ్డి జీవితం తెరపైకి రానుంది. నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. అరవింద్‌ రెడ్డి(రామచంద్రా రెడ్డి మనవడు) సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఆచార్య వినోబా బావే 127వ జయంతి సందర్భంగా చిత్రయూనిట్‌ ఆయనకు నివాళులు అర్పించింది. అరవింద్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘1951లో గాంధీజీ ప్రియ శిష్యుడైన ఆచార్య వినోబా భావే పిలుపు మేరకు 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు రామచంద్రా రెడ్డిగారు. ఆ చరిత్ర నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు. ‘‘వినోబా భావే ఆశయాలతో పని చేశారు రామచంద్రారెడ్డి.. అందుకే వినోబా భావే జయంతి సందర్భంగా నివాళులు అర్పించాం’’ అన్నారు చంద్రశేఖర్‌ రెడ్డి.

1951సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రథమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమికోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞం గా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యముతో ఈ సినిమా రూపకల్పనకు ప్రయత్నాలకు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు