Adipurush Teaser-Om Raut: ‘ఆది పురుష్‌’ టీజర్‌పై ట్రోలింగ్‌.. స్పందించిన డైరెక్టర్‌ ఓంరౌత్‌

5 Oct, 2022 12:05 IST|Sakshi

భారీ అంచనాల మధ్య అక్టోబర్‌ 2న రిలీజైన ఆదిపురుష్‌ టీజర్‌కు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ చిత్రాన్ని విజువల్‌ వండర్‌ అంటూ ఆకాశానికి ఎత్తుత్తుంటే.. మరికొందరు బొమ్మల సినిమాల ఉందంటూ ట్రోల్‌ చేస్తున్నారు. సాధారణ ప్రజలే కాదు రాజకీయ ప్రముఖులు సైతం టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రామాయణాన్ని అధ్యయనం చేయకుండానే ఓంరౌత్‌ ఆదిపురుష్‌ మూవీలో పాత్రలను తీర్చిదిద్దారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం మొత్తం ఆది పురుష్‌ టీజర్‌ ట్రోల్స్‌తో నిండిపోయాయి.
చదవండి: ‘అలా జరిగి ఉంటే.. బాహుబలిలో రాజమాత పాత్ర నేను చేసేదాన్ని’

ఇక టీజర్‌పై వస్తున్న విమర్శలపై తాజాగా దర్శకుడు ఓంరౌత్‌ స్పందించాడు.. ‘‘ఆది పురుష్‌ టీజర్‌ విడుదలైప్పటి నుంచి వస్తున్న విమర్శలు చూసి  నేను కాస్త ధైర్యం కోల్పోయిన మాట నిజమే. కానీ ఈ ట్రోలింగ్ చూసి నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ సినిమాను బిగ్‌స్క్రీన్‌ (వెండితెర) కోసం తీసింది. మొబైల్‌ ఫోన్‌ స్క్రీన్‌ కోసం కాదు. థియేటర్లో తెర పరిమాణం తగ్గించొచ్చు కానీ, ఆ పరిమాణాన్ని మరీ మొబైల్‌కు తగ్గించకూడదు. అలా చేస్తే అసలు బాగోదు. నాకు అవకాశం వస్తే యూట్యూబ్‌లో పెట్టకుండా చేయొచ్చు. ప్రతిఒక్కరికి చేరువలో ఉండాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్‌ ఆడియన్స్‌ కోసం అందుబాటులోకి తెచ్చాం’ అని వివరణ ఇచ్చాడు. 

అలాగే.. ‘కొద్ది మంది కోసమే ఈ సినిమాను తీయలేదు. థియేటర్‌కు దూరమైన వారి కోసం, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్లను సైతం థియేటర్‌కు రప్పించే ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఇది రామాయణం. గ్లోబల్‌ కంటెంట్‌ కోరుకుంటున్న తర్వాతి జనరేషన్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నాం. వారికి అర్ధమయ్యే భాషలో చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే మేము ఈ మార్గాన్ని (3డీ మోషన్‌ క్యాప్చర్‌)ను ఎంచుకున్నాం’ అని ఓంరౌత్‌ చెప్పుకొచ్చాడు.
చదవండి: హనుమంతుడి పాత్రపై హోంమంత్రి అభ్యంతరం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం!

పెద్ద తెరపై చూస్తేనే తాము తీసే కంటెంట్‌ విలువ తెలుస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇక వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌పై వస్తున్న ట్రోల్స్‌ నేపథ్యంలో ఇప్పటివరకూ తీసిన ఫుటేజ్‌ను మరింత మెరుగు పర్చేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కాగా మైథలాజికల్‌ చిత్రంగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో రూపొందిన  ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12ను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ప్రభాస్‌ రాముడిగా నటించగా.. బాలీవుడ్‌ అగ్ర నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా కనిపంచబోతున్నాడు. ఇక సీతగా కృతీసనన్‌ నటించింది. 

మరిన్ని వార్తలు