మా ముఖ్యమంత్రిని ఎవరేం అన్న సహించేది లేదు: దర్శకుడు

1 Oct, 2023 09:04 IST|Sakshi

తమిళ సినిమా: మహిళ నిర్మాత శ్యామల రమేష్‌ నిర్మించిన చిత్రం కటాక్షం. పట్టుకోట్టై శివ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కార్తీక్‌ చరణ్, మహాన అనే నవ జంట హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. దర్శకుడు కె. భాగ్యరాజ్‌ కీలకపాత్రలో పోషించిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడు చార్లీ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు.

ఇందులో కె. భాగ్యరాజ్, ఆర్‌వీ ఉదయకుమార్, పేరరసు, జాగ్వర్‌ తంగం తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కె. భాగ్యరాజ్‌ ఆడియోను ఆవిష్కరించగా పేరరసు, ఆర్‌వీ ఉదయ్‌ కుమార్‌ తదితరులు తొలి ప్రతిని అందుకున్నారు. ఈ  సందర్భంగా ఆర్‌వీ ఉదయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ చిత్ర కథానాయకి తమిళ భాషలో చాలా చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. నిర్మాత శ్యామల రమేష్‌ షూటింగ్‌ స్పాట్లో ఉదయం ఐదు గంటలకే అందరినీ నిద్రలేపి రెడీ చేయించడం అన్నది అభినందనీయం అన్నారు.

దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ప్రస్తుతం కర్ణాటకలో కొన్ని సంఘాలు చేస్తున్న ఆందోళన వివాదంగా మారుతుందని వాళ్లు మన ముఖ్యమంత్రి స్టాలిన్‌ను దూషించడం సరికాదన్నారు. తమిళనాడులో అనేక పార్టీలు ఉండవచ్చునని భేదాభిప్రాయాలు ఉండవచ్చునని, అయితే మనం తమిళనాడు దాటితే మనం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఎవరేమన్నా సహించేది లేదని పేర్కొన్నారు.

కె.భాగ్యరాజ్‌ మాట్లాడుతూ చిన్న చిత్రాలు లేనిదే చిత్రపరిశ్రమ లేదని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి థియేటర్లోనూ చిన్నచిత్రాలను ఒక్క షో అయినా ప్రదర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిన్న బడ్జెట్లో చిత్రాలు చేయడానికి నిర్మాతలు రావద్దని ఎవరు అన్నారని, అలా అనే హక్కు వారికీ లేదని చిత్త నిర్మాత రమేష్‌ పేర్కొన్నారు. తమ చిత్ర షూటింగ్‌ సమయంలో ఎందరో కళాకారులు, సాంకేతిక వర్గం జీవిస్తున్నారని తాను కళ్లారా చూశానని తమలాంటి చిన్న చిత్రాల నిర్మాతలు రాకపోతే అలాంటి వారికి జీవనోపాధి ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు. తను వారి కోసం అయినా మరో చిత్రం చేస్తానని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు