నువ్వు సాధించావ్‌ అన్నారు

5 Feb, 2021 05:46 IST|Sakshi

‘‘లాక్‌ డౌన్‌ తర్వాత ఆరంభించిన ఫస్ట్‌ చిత్రం మా ‘జాంబిరెడ్డి’. మొదట్లో ఇద్దరు ముగ్గురుతో ఉన్న సీన్స్‌ చేశాం.. ఒక్కో వారం గ్యాప్‌ తీసుకొని చేయడం వల్లే సినిమా ఇంత ఆలస్యం అయ్యింది.. లేదంటే మా సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సింది’’ అన్నారు ప్రశాంత్‌ వర్మ. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్‌ హీరోయిన్లుగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం మన సినిమాల్లో లవ్‌ జానర్‌ ఎలానో జాంబీ కూడా ఒక జానర్‌.

మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ అల్లుకుని ఈ సినిమా తీశా. హాలీవుడ్‌లో ఇప్పటికే జాంబీ సినిమాలు తీసినవాళ్లకి కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది.  ఎనిమిదేళ్ల క్రితమే ఈ సినిమా అనుకున్నాను. కుదరలేదు.. ఇప్పుడు కుదిరింది. ఒక తెలియని విషయాన్ని మనకు తెలిసిన విషయానికి కనెక్ట్‌ చేసి చెప్తే సులభంగా అర్థమవుతుంది. త్రివిక్రమ్‌గారు ఈ విధంగా చేస్తుంటారు. మహాభారతం, భాగవతంతో కలిపి తన సినిమాల్లో చెబుతుంటారాయన. అలా నేను కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేద్దామనుకొని జాంబీ కాన్సెప్ట్‌కి ఫ్యాక్షన్‌  యాడ్‌ చేశాను. ‘జాంబిరెడ్డి’ టైటిల్‌ పెట్టినప్పుడు చాలానే బెదిరింపులు వచ్చాయి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ కాబట్టి ఆ టైటిల్‌ పెట్టాం. ఇండస్ట్రీలో భిన్నమైన స్వరాలు వినిపించాయి.

‘ఇలాంటి జానర్‌ మేం చేద్దాం అనుకున్నాం.. కానీ ప్రేక్షకులకు అర్థం కాదేమో అని వదిలేశాం’ అని కొందరు.. ‘మంచి ఐడియా’ అని మరికొందరు అన్నారు. అయితే ట్రైలర్‌ విడుదలయ్యాక ‘నువ్వు సాధించావ్‌’ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రంలో పెద్ద హీరో అయితే మార్కెట్‌ పరిధి బాగుండేది. కానీ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టేదేమో? త్వరగా సినిమా చెయ్యాలనుకున్నాను.. తేజ సరిపోతాడనిపించి తీశాను. మా చిత్రం టీజర్‌ రిలీజ్‌ అయ్యాక హిందీ రీమేక్‌కి అవకాశాలొచ్చాయి. సమంతగారికి చెప్పింది ‘జాంబిరెడ్డి’ కథ కాదు.. వేరేది. మేమిద్దరం ఆ స్క్రిప్ట్‌ని నమ్మాం.. కానీ నిర్మాత దొరకలేదు. నా దగ్గర ప్యాన్‌ ఇండియా కథలు కూడా ఉన్నాయ్‌. ‘జాంబిరెడ్డి’ విజయం సాధించి మంచి పేరు వస్తే, సీక్వెల్‌ని ప్యాన్‌ ఇండియా స్థాయిలో తీస్తాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు