అవమానించినా.. అతనితో సినిమా తీశాను: ప్రశాంత్‌ వర్మ

20 Jul, 2021 14:55 IST|Sakshi

వైవిధ్యమైన కథతో సినిమాలను అందించడంలో డైరెక్టర్‌  ప్ర‌శాంత్ వ‌ర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది‌. అ, కల్కి, వంటి సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్‌ వర్మ ఇటీవలె తేజ సజ్జాను హీరోగా పరిచయం చేశారు. జాంబీ రెడ్డితో తొలిసారిగా సౌత్‌లో జాంబీ జోనర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు ప్రశాంత్‌ వర్మ. దర్శకుడిగా సత్తా చాటుతున్న ఆయన ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తొలినాళ్లలో తనకు ఎదురైన అవమానాల గురించి వెల్లడించాడు.

'ఓ హీరోకు కథ చెప్పడానికి వాళ్ల ఇంటికి వెళ్లాను. ముందుగానే ఆయనకి కాల్‌ చేసి రమ్మంటేనే వెళ్లాను. అయితే అక్కడికి చేరుకోగానే పెద్ద వర్షం మొదలైంది. దీంతో నేను గేటు బయటే ఉండి ఆయనకు కాల్‌ చేశాను. అయినా నన్ము లోపలికి రమ్మనకుండా అలానే వర్షంలో వెయిట్‌ చేయించాడు. ఆ రోజు వర్షంలో నేను తడిసిపోతూ, ఆయన ఇంటివైపు చూస్తూ నిలబడ్డాను. కిటికీలోంచి ఆ హీరో నన్ను చూస్తుండటం నేను గమనించాను. కనీసం లోపలికి కూడా పిలవకుండా బయటే నిలబెట్టడంతో చాలా కోపం వచ్చింది. అయినా తమాయించుకొని ఆ హీరోకు కథ చెప్పి సినిమా కూడా చేశాను' అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరో ఎవరన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ తేజ సజ్జాతో కలిసి హనుమాన్‌ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు